విశాఖపై సీఎం జగన్ మరో క్రియాశీలక నిర్ణయం...

ఆంధ్రప్రదేశ్ కాబోయే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్నానికి సంబంధించి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

news18-telugu
Updated: August 2, 2020, 2:08 PM IST
విశాఖపై సీఎం జగన్ మరో క్రియాశీలక నిర్ణయం...
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ కాబోయే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్నానికి సంబంధించి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ఓ ప్యానెల్ ఏర్పాటు చేశారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేస్తుంది. ఈ ప్యానెల్‌లో నలుగురు ఐజీలు, ఒక ప్లానింగ్ ఓఎస్డీ సభ్యులుగా ఉంటారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సెక్రటేరియట్ కార్యాలయాలు, హెచ్ఓడీ ఆఫీసులు అన్నీ విశాఖకు తరలి వెళ్తాయి కాబట్టి నగరంలో తీసుకోవాల్సిన మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, అదనపు పోలీసు బలగాల నియామకం, ఇతరత్రా పోలీసు వ్యవస్థకు కావాల్సిన మౌలిక వసతులు అన్నీ ఈ కమిటీ పరిశీలించి నివేదికను అందస్తుంది. ఒకటి, రెండు రోజుల్లో కమిటీ తమ పనిని మొదలు పెట్టబోతోంది. ప్రస్తుతం మంగళగిరిలో ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్స్‌ను విశాఖపట్నానికి తరలించడం అనివార్యంగా మారింది. కొన్ని రోజుల క్రితం డీజీపీ గౌతమ్ సవాంగ్ విశాఖపట్నం వెళ్లి అక్కడ పోలీస్ కేంద్ర కార్యాలయం కోసం కొన్ని ప్రాంతాలను పరిశీలించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రెండు రోజుల క్రితం ఆమోదం తెలిపారు. దీంతో మూడు రాజధానులకు రూట్ క్లియర్ అయింది. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం రాజధాని వికేంద్రీకరణ వెంటనే అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి అది అమలవుతుంది. ఇది ఒకేసారి అమల్లోకి వస్తుంది. ఈ బిల్లు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ అమరావతిలో కొలువవుతుంది. రాజ్ భవన్, సచివాలయం, హెచ్ ఓడీల కార్యాలయాలు కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో ఉంటాయి. జ్యుడీషియల్ రాజధానిగా కర్నూలు ఉంటుంది. హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపుతుంది. ఏ కార్యాలయాలు ఎక్కడ ఉండాలి, అందుకు కారణాలు ఏంటనే అంశాన్ని ప్రభుత్వం రాతపూర్వకంగా తెలియజేస్తుంది.

అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ ఏరియాను శాసనరాజధానిగా పిలుస్తారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ ఏరియాను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా పిలుస్తారు. కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ ఏరియాను జ్యూడీషియల్ క్యాపిటల్‌గా పిలుస్తారు. ఈ మూడు రీజియన్లను ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ చట్టం - 2016 కింద నోటిఫికేషన్ జారీ చేసి ఏర్పాటు చేస్తారు.

అలాగే, రాష్ట్రంలో జోన్ల అభివృద్ధికి ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేయవచ్చు. ఆ జోన్ల గురించి ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేయవచ్చు. ఆ బోర్డులకు కొన్ని అధికారాలను కూడా కట్టబెట్టే అవకాశం ఈ బిల్లు ద్వారా లభిస్తుంది. ఈ బోర్డుల బాధ్యతలు నిర్వహించే వారు అధికారుల నుంచి సమాచారం కోరే అధికారం ఉంటుంది. జోన్లలో అభివృద్దికి సంబంధించి సమీక్షలు కూడా నిర్వహించే అధికారం కలిగి ఉంటుంది. జోన్ల అభివృద్దికి సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 2, 2020, 2:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading