ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం మూడు రాజధానుల బిల్లులను ( 3 Capital Issue) వెనక్కి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజా శాసనమండలి రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్ని కూడా వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన తీర్మానాన్ని మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశముంది. మూడు రాజధానుల బిల్లులు శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత మండలికి వెళ్లగా అక్కడ అధికార పార్టీకి సరైన బలం లేకపోవడంతో ఆమోదం పొందలేదు. దీంతో సీఎం జగన్ మండలిని రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర హోంశాఖకు పంపారు. ఆ తర్వాత జగన్ ఢిల్లీ పర్యటనలో పలుసార్లు ఇదే అంశాన్ని కేంద్ర పెద్దల వద్ద లేవనెత్తిన సంగతి తెలిసింది.
ఐతే తాజా ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలను వైసీపీ కైవసం చేసుకునే అవకాశముండటంతో మండలిలోనూ ఆ పార్టీకి పూర్తి మెజారిటీ రానుంది. ఈ నేపథ్యంలో మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. త్వరలో ఎన్నికల ప్రక్రియ పూర్తైతే మండలిలోనూ వైసీపీకి ఆధిక్యం రానుంది. అప్పుడు మార్పులు చేసి ప్రవేశపెట్టే రాజధానుల బిల్లుకు అడ్డంకి ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదిలా ఉంటే మూడు రాజధానుల బిల్లు మండలిలో వీగిపోయిన తర్వాత ప్రజాప్రయోజనాలకు, అభివృద్ధికి ఉపయోగపడని మండలి ఎందుకని.. అభివృద్ధిని అడ్డుకునే సభ మనకు అవసరమా అంటూ సీఎం జగన్ మండలి రద్దు తీర్మానం సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపింది. ఐతే అప్పటి నుంచి కేంద్రం మండలి రద్దు అంశాన్ని పెండింగ్ లోనే ఉంచింది.
ఐతే ఈ లోగా మండలిలో కొన్ని స్థానాలు ఖాళీ అవడంతో సీఎం జగన్ పలువురికి పదవులిచ్చారు. తాజాగా ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో మొత్తం 14కి 14 వైసీపీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. దీంతో మండలిలో వైసీపీ బలం పెరగడంతో పాటు టీడీపీ సంఖ్యాబలం తగ్గిపోతుంది. దీంతో రెండు సభల్లో మెజారిటీ వస్తుండటంతో మండలిని రద్దూ చేస్తూ చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐతే మండలి రద్దు అంశంలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు గట్టిగానే విమర్శించారు. మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేయించిన వైఎస్ జగన్.. ఎమ్మెల్సీ పదవులు ఎందుకు భర్తీ చేశారని కూడా నిలదీశాయి. కేవలం పదవులు ఇవ్వడానికి, పరిస్థితులను అనుగుణంగా మార్చుకునేందుకు ఇలా చేస్తున్నారని కూడా విమర్శిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.