AP YCR Pension Kanuka : ఫిబ్రవరి 15న ఇంటింటికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... తాజాగా కొత్త పెన్షన్ కార్డుల్ని కూడా పంపిణీ చెయ్యాలని నిర్ణయించింది. దానికి ఇవాళే ముహూర్తం పెట్టుకుంది. ఈ రోజు నుంచీ ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ పొందే అర్హత ఉన్న అందరికీ... కొత్తగా రూపొందించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్డుల్ని గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా అందజేయబోతున్నారు. ఈ పెన్షన్లలో రకరకాలున్నాయి. అన్ని రకాల లబ్దిదారులూ కలిపితే... ఏపీలో ఫిబ్రవరి నాటికి 54,68,322 మంది ఉన్నారు. వీరందరికీ పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అవసరమైన నిధులు విడుదల చేసింది. వారందరికీ సోమవారం నుంచి ఫిబ్రవరి 20 వరకు నాలుగు రోజుల పాటు కొత్త పెన్షన్ కార్డులు పంపిణీ చేయబోతున్నట్లు... గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో రాజాబాబు తెలిపారు. ఎవరూ ఎలాంటి టెన్షన్లూ పెట్టుకోకుండా... ప్రశాంతంగా మనస్శాంతిగా గ్రామ లేదా వార్డు వాలంటీర్ల ద్వారా పెన్షన్ కార్డులు పొందాలని అధికారులు కోరుతున్నారు.
ఫిబ్రవరిలో కొత్తగా పెన్షన్లకు అర్హులైన వారికి పెన్షన్ బుక్‌తోపాటూ... గుర్తింపు కార్డు కూడా ఇస్తారు. ఆల్రెడీ పెన్షన్ పొందుతున్న వారికి ఇదివరకే పెన్షన్ బుక్‌లు ఇచ్చారు కాబట్టి... వాళ్లకు కొత్త పెన్షన్ కార్డులు మాత్రమే ఇస్తారు. ఆ కార్డులు తీసుకున్న వారు వాటిలో తమ పేరు, ఎలాంటి పెన్షన్ పొందుతున్నారు, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ వంటి వివరాల్ని రాసిపెట్టుకోవాలి. ఎప్పుడైనా పొరపాటున పెన్షన్ రాకపోతే... ఈ కొత్త కార్డు ఆధారంగా పెన్షన్ డబ్బులు అడగొచ్చు. అందుకే ఈ కొత్త కార్డుల్ని జాగ్రత్తగా దాచుకోవాలి. అదనంగా ఓ కాపీని జిరాక్స్ తీయించుకొని ఉంచుకుంటే కూడా మంచిదే.
ఈ మధ్య ప్రభుత్వం చాలా మందిని పెన్షన్‌కు అనర్హులుగా ప్రకటించింది. దాంతో చాలా మంది తాము అర్హులమేననీ, దయచేసి తమ పేరును అనర్హత లిస్టు నుంచీ తొలగించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం రీ సర్వే జరిపిస్తోంది. రీ సర్వేలో అర్హులైన వారికి మార్చి 1న గుర్తింపు కార్డులు ఇవ్వబోతోంది. ఐతే... ప్రభుత్వం ఇప్పటికే కొత్తగా 6,14,244 మందికి పింఛన్లు ఇచ్చింది. ప్రతిపక్షాలు మాత్రం పెన్షన్ దారులకు అన్యాయం చేస్తున్నారనీ, వారి పేర్లను తొలగించేశారని ఆరోపిస్తున్నాయి. ఆ విషయం అలా ఉంచితే... ఇప్పుడు లబ్దిదారులంతా కచ్చితంగా కొత్త పెన్షన్ కార్డుల్ని పొండాలి. దీనిపై అనుమానాలేవైనా ఉంటే ఓసారి గ్రామ లేదా వార్డు వాలంటీర్‌కి కాల్ చేసి కనుక్కోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు తెలిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm jagan, Cm jagan, Pension Scheme, Visakha Railway Zone, Ys jagan