ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా సంగం డెయిరీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెయిరీ యాజమాన్యాన్ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. డెయిరీ యాజమాన్యాన్ని ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు బదిలీ చేసింది. గతంలో ఈ బాధ్యతను గుంటూరు జిల్లా పాలఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేసింది. అలాగే డెయిరీ రోజువారీ కార్యకలాపాలు నిర్వగహించే బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ కు అప్పగించింది. దీంతో సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ డెయిరీకి చేరుకున్నారు. డెయిరీ రోజువారీ కార్యకలాపాలను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అవినీతి కారణంగానే డెయిరీని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది. మరోవైపు డెయరీ వ్యవహారంలో ప్రభుత్వం తీరును సవాల్ చేస్తూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. ఓ వైపు పిటిషన్ కోర్టులో విచారణలో ఉండగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. ఇది పూర్తిగా వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యేనని ఆరోపిస్తున్నారు.
సంగం డెయిరీలో భారీగా అవినీతి జరిగిందని.., వేల కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయంటూ ఏసీబీ అధికారులు డెయిరీలో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు ఆయన్ను కోర్టులో హాజరుపరచగా.. రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
మరోవైపు ఈ వ్యవహారాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. తమపై కక్ష తీర్చుకునేందుకు ఆర్ధిక మూలాలను దెబ్బతీస్తున్నారని.. పాడి రైతులకు మెరుగైన బోనస్ చెల్లిస్తున్న సంగంను దెబ్బకొట్టి.. అమూల్ కు లబ్ధిచేకూర్చేందుకు అవినీతి పేరుతో సంగం డెయిరీపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే పాడి రైతులను నట్టేటముంచేందుకే వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని విమర్శిస్తున్నారు. పాడి రైతులకు బోనస్ ఇవ్వకపోగా.. డెయిరీని దొడ్డిదారిలో ఆక్రమిస్తున్నారని మండిపడుతున్నారు.
టీడీపీ విమర్శలకు వైసీపీ నేతలు చెక్ పెడుతున్నారు. సంగం డెయిరీ పేరుతో ధూళిపాళ్ల నరేంద్ర వేలకోట్లు దోచుకున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే రైతులకు సరైనా చెల్లింపులు లేకుండా వారికి అన్యాయం చేశారని విమర్శిస్తున్నారు. అవినీతికి చెక్ పెట్టి పాడి రైతులకు న్యాయం చేసేందుకే డెయిరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. మా ప్రభుత్వం ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని.. తప్పు చేసిన వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Politics