Andhra Pradesh : ఉగాది రాగానే... విశాఖపట్నం నుంచీ పారిపాలన సాగించాలనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు సంబంధించి ఏర్పాట్లను జోరుగా సాగిస్తోంది. ఐతే... ఉగాది నుంచీ ప్రభుత్వ శాఖల్ని విశాఖకు తరలించేందుకు ఏం చెయ్యాలి, ఆ ప్రక్రియ ఎలా సాగించాలి అనే అంశాలపై ఇప్పుడు దృష్టిసారిస్తోంది. ఇప్పటికే అధికారులు విశాఖలో భవనాలపై దృష్టిసారించారు. ప్రధానంగా విశాఖకు సెక్రటేరియట్, సీఎం క్యాంప్ ఆఫీస్, రాజ్‌భవన్... అమరావతి నుంచి తరలిపోనున్నాయి. ఉగాది నుంచీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి... విశాఖలోనే ఉండబోతున్నారు. అందుకోసం ఏప్రిల్ నుంచీ ప్రభుత్వ శాఖల్ని విశాఖకు తరలించబోతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా... రుషికొడ ఐటీ సెజ్‌లోని మిలీనియం టవర్లలో సెక్రటేరియట్, సీఎం ఆఫీస్ ఉండబోతున్నట్లు అనధికారికంగా తెలిసింది.
ఏప్రిల్ ఆఖరు నాటికి భవనాల తరలింపు ప్రక్రియ పూర్తి చెయ్యాలనుకుంటున్న ప్రభుత్వం అందుకోసం ఎక్కడెక్కడ పెద్ద భవనాలు ఉన్నాయో వెతికించింది. ఆయా శాఖల అధికారులే ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టారు. రాజధానిని తరలించాలంటే... శాసన మండలిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, CRDA రద్దు బిల్లు ఆమోదం పొందాల్సి ఉంటుంది. బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందేలా చేసుకోవాలనుకుంటున్న ప్రభుత్వం... జిల్లా కార్యాలయాల్లోనే శాఖల కార్యాలయాలు కూడా ఉంచే ఆప్షన్‌ను పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి వుడా భవనం, నీటిపారుదల శాఖ ఆఫీస్, ఏయూలోని గోల్డెన్ జుబ్లీ గెస్ట్ హౌస్, పోర్టు గెస్టు హౌస్, స్టార్టప్ విలేజ్‌లోని భవనాల్ని చూస్తున్నారు.
మిలీనియం టవర్లలోకి ప్రభుత్వ ఆఫీసుల్ని తరలిస్తే, అక్కడికి దగ్గర్లోనే ఉన్న నౌకాదళానికి చెందిన INS కళింగకు భద్రతాపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపించగా... తాము ఈ ఘటనపై అసలు స్పందించనే లేదనీ, ప్రభుత్వం తమను ఈ విషయమై అడగలేదనీ, రాష్ట్ర ప్రభుత్వానికి తామెలాంటి లేఖా రాయలేదని తూర్పు నౌకాదళ అధికారులు స్పష్టం చేశారు. ప్రజల్ని టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని వైసీపీ నేతలు ప్రతిపక్షంపై మండిపడ్డారు.
రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు మండలంలోని గ్రామాల్ని కలుపుతూ అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు చేయబోతోంది ప్రభుత్వం. గతంలో అమరావతి నగర పాలక సంస్థ ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చినా, తగినంత జనాభా లేరనే ఉద్దేశంతో మున్సిపాలిటీగా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. మరోవైపు అమరావతిలో రైతుల ఆందోళనలు నేడు 67వ రోజుకు చేరుకున్నాయి. నిన్న అమరావతి బంద్ విజయవంతంగా నిర్వహించినట్లు రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన అభిప్రాయాన్ని మార్చుకోవాలని కోరుతున్నారు.