AP Local Body Elections: నిమ్మగడ్డను ఫాలో అయిన నీలం సాహ్నీ.. ట్విస్ట్ ఇచ్చిన ప్రతిపక్షాలు

ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్ని(ఫైల్ ఫోటో)

ఇది కొత్త ఎన్నికల నోటిఫికేషన్ కాదని.. నిలిచిపోయిన ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తున్నామని ఎస్ఈసీ నీలం సాహ్నీ (SEC Neelam Sawhney) అంటున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు లేవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ స్పష్టం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ నీలం సాహ్నీ సమావేశం ముగిసింది. ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు, డీజీపీతో చర్చించామని.. ప్రక్రియలో భాగంగా రాజకీయా పార్టీలతో సమావేశమై అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలిపారు. సమావేశానికి వైసీపీ తరపున లేళ్ల అప్పిరెడ్డి, సీపీఎం తరపున వైవీ రావు, కాంగ్రెస్ తరపున మస్తాన్ రావు హాజరయ్యారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా సజావుగా జరుగుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. నిన్నరాత్రి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తైందని.. బ్యాలెట్ పేపర్లు కూడా జారీ అయిన నేపథ్యంలో ఎన్నికలు వీలైనంత త్వరగా జరపాలన్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు 2018 నుంచి.., 2019 నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయన్నారు.

    2020 జనవరిలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా కొవిడ్ కారణంగా వాయిదా పడ్డాయని నీలం సాహ్నీ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై ఎలాంటి అభ్యంతరాలు లేవని.. అందుకే ముందుకెళ్తున్నామన్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.  పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రతి జిల్లాలోనూ నోడల్ ఆఫీసర్లను కొనసాగిస్తామన్నారు. అలాగే రాష్ట్ర కార్యాలయంలోనూ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియ వేగంగా పూర్తి కావాల్సి ఉందన్నారు.

    మరోవైపు సమావేశాన్ని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు భారతీయ జనతాపార్టీ, జనసేన, సీపీఐ పార్టీలు బహిష్కరించాయి. స్థానిక ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు టీడీపీ స్పష్టం చేయగా.. తాము దాఖలు చేసిన పిటిషన్ ఏ వైపు హైకోర్టులో విచారణలో ఉండగా.. ఎన్నికల ప్రకటన విడుదల చేయడంపై జనసేన అభ్యంతరం తెలుపుతోంది. బీజేపీ మాత్రం.. ప్రభుత్వం తయారు చేసిన ప్రకటననే ఎస్ఈసీ చదివి వినిపించారని ఆరోపిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత సమావేశానికి పిలవడమేంటని సీపీఐ ప్రశ్నిస్తోంది.

    ఐతే ఎస్ఈసీతో సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీ గైర్హాజరవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ పార్టీలు సమావేశాన్ని మాత్రమే బహిష్కరించాయా..? లేక ఎన్నికలను బహిష్కరించాయా..? అనేది చర్చనీయాంశమవుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో మెజారిట నేతలు ఎన్నికలు బహిష్కరించాలని కోరినట్లు తెలుస్తోంది. పార్టీ నేతలు నిర్ణయాన్ని చంద్రబాబుకే వదిలేశారు. మరోవైపు జనసేన-బీజేపీలు ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చిస్తున్నాయి. ఈవిషయంలో ఎస్ఈసీ ఏకపక్షంగా ముందుకెళ్తోందని బీజేపీ ఆరోపించింది.
    Published by:Purna Chandra
    First published: