ANDHRA PRADESH ELECTION COMMISSIONER NIMMAGADDA RAMESH KUMAR RELEASED NEW APP FOR PANCHAYAT ELECTIONS AND APP NAMES AS E WATCH PRN
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ నిఘా.. కొత్త యాప్ రిలీజ్ చేసిన నిమ్మగడ్డ
పంచాయతీ ఎన్నికల కోసం యాప్ విడుదల చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) కోసం ఎన్నికల సంఘం (State Election Commission) కొత్త యాప్ ను ఆవిష్కరించారు. E-వాచ్ (E-watch APP) పేరుతో రూపొందించిన ఈ యాప్ ను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh kumar) ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం కొత్త యాప్ ను ఆవిష్కరించారు. E-వాచ్ పేరుతో రూపొందించిన ఈ యాప్ ను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబందించిన ఫిర్యాదులు, ఇతర వివరాలు, సమాచారం కోసం యాప్ ను రూపొందించినట్లు ఎస్ఈసీ వెల్లడించారు. ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే దానికి సంబంధించిన వివరాలతో పాటు ఫోటోలను కూడా అప్ లోడ్ చేసే అవకాశముందని తెలిపారు. ఎన్నికలను పారదర్శంగా నిర్వహించేందుకే యాప్ ను రూపొందించినట్లు తెలిపారు. బలవంతపు ఏకగ్రీవాలు, దాడులను అరికట్టేందుకు యాప్ ను రూపొందించారు. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు, ఓటర్లకు పటిష్ట భద్రతను ఈ యాప్ ద్వారా కల్పిస్తున్నామన్నారు. యాప్ కు తోడు ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశామన్నారు.
యాప్ ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను ఎస్ఈసీ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు సంబంధిత అధికారులకు ఫార్వార్డ్ చేస్తామని నిమ్మగడ్డ తెలిపారు. రేపటి నుంచి గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ అందుబాటులో ఉంటుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. యాప్ ద్వారా చేసిన ఫిర్యాదులు పరిష్కారమయ్యాయా లేదా అనేది కాల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ఇందులో కొత్తగా ఏమీ లేదని.. టెక్నాలజీ సాయంతో సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఎన్నికల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకు యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిమ్మగడ్డ వివరించారు. ఇక ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు చురుగ్గా ఉన్నారన్నారు.
కోర్టుకెళ్లిన ప్రభుత్వం
ఐతే E-వాచ్ యాప్ ను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం, పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన యాప్ లు ఉండటే ప్రత్యేకంగా యాప్ ను డిజైన్ చేయాల్సిన అవసమేంటని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం అనుమతి లేకుండా బయటి టెక్నాలజీలు వాడేందుకు ఎస్ఈసీకి అధికారం లేదని వాదిస్తోంది. యాప్ ను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రూపొందించారన్న అనుమానం ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే దాడులకు సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేసి అధికార పార్టీపై నెట్టే ప్రయత్నాలు జరగొచ్చని విమర్శిస్తున్నారు. యాప్ ను నిలిపేయాలంటూ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. యాప్ వినియోగంపై స్టే ఇవ్వాలని పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్ గురువారం విచారణకు రానుంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.