ANDHRA PRADESH ELECTION COMMISSION READY TO CONDUCT LOCAL BODY ELECTIONS SOON AND SUSPENSE OVER CONTINUATION OF OLD NOTIFICATION HERE ARE THE DETAILS PRN
AP Local Body Elections: ఏపీలో మరోసారి ఎన్నికల నగారా.. ఎస్ఈసీ ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ
నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)
ఏపీ ఎస్ఈసీని (AP SEC) కలిసిన సీఎస్ (CS Adityanath Das).. ఎంపీటీసీ, (MPTC) జడ్పీటీసీ (ZPTC), మున్సిపల్ ఎన్నికలపై (Municipal Elections) చర్చించారు. ఈ సందర్భంగా ఈ ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహించాలన్న ప్రభుత్వ అభిప్రాయాన్ని సీఎస్.. ఎస్ఈసీతో చెప్పినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఎన్నికల నగారా మోగబోతోంది. గతేడాది వాయిదా పడిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గురువారం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో భేటీ అయిన సీఎస్ ఆదిత్యానాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్.. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం సాయంత్రం మరోసారి ఎస్ఈసీని కలిసిన సీఎస్.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా ఈ ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహించాలన్న ప్రభుత్వ అభిప్రాయాన్ని సీఎస్.. ఎస్ఈసీతో చెప్పినట్లు తెలుస్తోంది.
ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విషయంలో ఎస్ఈసీ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల షెడ్యూల్ ను కొత్తగా ప్రకటించి నోటిఫికేషన్ ఇస్తారా..? లేక గత ఏడాది ఎక్కడ ఆగాయో అక్కడి నుంచి కొనసాగిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ఐతే దీనిపై న్యాయసలహా కోరాలని ఎస్ఈసీ భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో కొన్ని చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త షెడ్యూల్ విడుదల చేస్తే అవన్ని రద్దవడమే కాకండా న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే గత ఏడాది ఎస్ఈసీ 75 మున్సిపాలిటీలు, 12 మున్సిపల్ కార్పొరేషన్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికల ప్రక్కియ నామినేషన్ల స్వీకరణ దశలో ఉండగా వాయిదా పడ్డాయి. ఇక్కడ కూడా పాత నోటిఫికేషన్ కొనసాగిస్తారా.. కొత్తగా జారీ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. పాత నోటిఫికేషన్ కొనసాగిస్తే ప్రభుత్వం కూడా వ్యతిరేకించదు.. కొత్తగా ఇస్తే మాత్రం అభ్యంతరం తెలిపే అవకాశముంది.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను సీరియస్ గా తీసుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.., పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆయా మండలాల్లోని ఎంపీడీవోలను బదిలీ చేశారు. అలాగే చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీ సహా పలువుర్ని బదిలీ చేశారు. దీంతో పాటు ఈ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలను నిలిపేయాలని ఆదేశాలిచ్చినా.. గవర్నర్ తో భేటీ అనంతరం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్త షెడ్యూల్ ఇస్తారా లేద పాత నోటిఫెకేషన్ కొనసాగిస్తారా అనే అంశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఐతే ప్రతిపక్షాలు మాత్రం కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.