ANDHRA PRADESH CM YS JAGAN TO MEET AMITH SHAH IN DELHI PRN
Andhra Pradesh CM: వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ వెనుక కారణాలు ఆవేనా?
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర సమస్యలతో పాటు వ్యవసాయ చట్టాలపైనా (Agriculture Acts) కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith Shah) చర్చించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సడన్ గా ఢిల్లీ వెళ్తున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన హస్తినకు పయనమవుతున్నారు. రాత్రి 9గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వైఎస్ జగన్ భేటీకానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ముఖ్యంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు, నివర్ తుఫాన్ ధాటికి దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఆస్తి నష్టాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లి వెంటనే సాయం అందించాల్సిందిగా జగన్ కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే పోలవరం, విభజన సమస్యలను కూడా మరోసారి ప్రస్తావించే అవకాశముంది. మరోవైపు జగన్ సడన్ గా ఢిల్లీ వెళ్తుండటం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
అసలు కారణం ఇదేనా..?
కేంద్రం పిలుపుతోనే సీఎం ఢిల్లీ వెళ్లినట్లు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై అమిత్ షా.. సీఎం జగన్ తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జరిగిన భారత్ బంద్ కు వైసీపీ ప్రభుత్వం మద్దతిచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. సాగు చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చట్టాలపై జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా 700 మీడియా సమావేశాలు, 700 సదస్సులు నిర్వహించి కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మేలే జరుగుతుందని వివరించాలని తీర్మానించింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈ సదస్సులు విజయవంతం చేసేందుకు సహకరించాలని జగన్ను అమిత్ షా కోరనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. వివిధ రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు కోరగానే అపాయింట్మెంట్ ఇచ్చేసి వారు ఇచ్చిన వినతిపత్రాలు స్వీకరించడం.., అదే సమయంలో వ్యవసాయ చట్టాలకు సహకరించాల్సిందిగా అమిత్షా తనదైన శైలిలో కోరుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జగన్కు అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చినట్లు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. కేంద్రమే జగన్ను ఢిల్లీకి పిలిపించిందని బీజేపీ వర్గాలంటున్నాయి. ప్రధానిని, ఇతర మంత్రులను కలిసే అవకాశం లేదని స్పష్టం చేశాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ హోం మంత్రిని కలిసిన మూడో రోజునే జగన్ కూడా షాను కలుస్తుండటం చర్చనీయాంశమైంది.
జగన్ హస్తిన పర్యటనలో ఏం సాధించుకొస్తారు..? కేంద్రం తాను అనుకున్న పనిని రాష్ట్ర ప్రభుత్వంతో చేయించుకోగలదా..? అనేది వేచి చూడాలి.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.