అన్నా రఘు, గుంటూరు ప్రతినిధి, న్యూస్18
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం మంత్రివర్గంలో మార్పులు చేర్పుల చుట్టూనే తిరుగుతున్నాయి. కొంతకాలంగా కేబినెట్ బెర్తులపైనే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. మంత్రి మండలంలో ఎవరుంటారు.. ఎవరు పదవులు కోల్పోతారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలి..? ఉన్నవారిలో ఎవరెవరిని తప్పించాలి అనే విషయంలో సీఎం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సిమ్లా పర్యటలో ఇదే అంశంపై తన ఆంతరంగికులతో జగన్ చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం వైఎస్ జగన్ తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సమేతంగా ఇటీవల సిమ్లాకు వెళ్లారు. ఐతే ఆయనతో పాటు కొందరు కీలక వ్యక్తులు సిమ్లా పర్యటనలో పాల్గొన్నారు. వీరంతా కలిసి అక్కడే శాసనసభ్యుల పనితీరుపై వివరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టును సదరు నేతలు సీఎం ముందుంచినట్లు సమాచారం. అలాగే ఎమ్మెల్యేల స్పందను కూడా వివరించినట్లు టాక్.
ఈ క్రమంలో త్వరలోనే సీఎం జగన్ శాసనసభ్యులతో భేటీ అయ్యే ఛాన్స్ ఉందట. ఐతే ఎమ్మెల్యేలు విన్నవించుకున్న నిధులు కేటాయింపు అంశాన్ని పక్కనబెట్టి.. పార్టీ పరంగా, రాజకీయ పరంగా బలపడే దిశగా సీఎం ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై అంతర్గత నివేదికలు తెప్పించుకున్న జగన్ వాటిని వారి ముందు ఉంచనున్నారని టాక్. అందరినీ ఒకే సారి కాకుండా ఒక్కొక్కరి గా శాసనసభ్యులను కలిసి వారి పనితీరు ఆధారంగా వారికి క్లాస్ తీసుకోవాలని గట్టినిర్ణయానికైతే వచ్చారని తెలుస్తోంది. కష్టపడి పని చేసేవారికి దక్కే అవకాశాలు వివరించడంతో పాటు పనితీరు సరిలేని వారికి ముందుగానే హెచ్చరికలు పంపడం ద్వారా మంత్రివర్గంలో మార్పుల తరువాత కూడా అసంతృప్తుల నుండి తలనొప్పులు కూడా లేకుండా చేసుకోవచ్చుననేది సీఎం ప్రధాన ఉన్నదేశమని టాక్.
పార్టీ అధికారంలో ఉండే వచ్చే రెండున్నరేళ్లతో పాటు 2024 ఎన్నికలను ధృష్టిలో పెట్టుకుని వ్యూహాలు రచించేపనిలో సీఎం జగన్ పడ్డారట. రానున్న రోజుల్లో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు తాను కూడా ఎక్కువ సమయం ప్రజలలో ఉండే విధంగా అక్టోబర్ 2 నుండి రచ్చబండ కార్యక్రమం నిర్వహణపై కూడా ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తుంది. ఈలోగా ఎమ్మెల్యేలతో ముఖాముఖి చర్చలు పూర్తి చేయాలని సీఎం నిర్ణయించినట్లు వైసీపీలో చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో సీఎం అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలివ్వాలనే అంశాలపై ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో మంత్రివర్గానికి సంబంధించిన కసరత్తు పూర్తి చేసుకొని వైసీపీ సెకండ్ హాఫ్ పాలనను మరింత ముందుకు తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నారట. మొత్తానికి మంత్రి వర్గంలో మార్పుల వ్యవహారం శీతాకాలంలో రాజకీయ వేడిని రగిల్చే ఛాన్సుందని విశ్లేకులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Politics, Ysrcp