Andhra Pradesh: చాలా రోజుల తరువాత నేడు జనంలోకి జగన్.. కారణం ఇదే..!

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

సీఎం జగన్ చాలా రోజుల తరువాత జనంలోకి వెళ్తున్నారు. ఇటీవల అన్ని కార్యక్రమాలను వర్చువల్ విధానం ద్వారానే ప్రారంభిస్తున్న ఆయన.. నేరుగా ఇప్పుడు ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు..

  • Share this:
    ఏపీ సీఎం జగన్ గొల్లపూడిలో పర్యటించనున్నారు. ఈరోజు దిశ మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారు. దిశ యాప్‌ ప్రచార కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొననున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జగన్‌ గొల్లపూడి వెళ్లనున్నారు. కరోనా కాలంలో ప్రభుత్వ కార్యక్రమాలు బహిరంగంగా జరగడం చాలా అరుదుగా మారింది. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ పాల్గొనే కార్యక్రమాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అతిముఖ్యమైన కార్యక్రమం అయితే తప్ప సీఎం సభలు నిర్వహించడం లేదు. కరోనా కారణంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచే వర్చువల్ గానే ప్రభుత్వ పథకాలు, ఇతర కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తున్నారు. చాలా రోజుల తరువాత సీఎం జగన్ తొలిసారి బహిరంగ కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ కృష్ణాజిల్లా, విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో జరిగే కార్యక్రమానికి సీఎం హాజరవుతున్నారు.

    గొల్లపూడిలో జరిగే దిశ యాప్ ప్రచార కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. దిశ యాప్ ను ప్రతి మహిళ డౌన్ లోడ్ చేసుకునేలా చేపట్టిన కార్యక్రమానికి జగన్ హాజరవుతున్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరగకుండా అరికట్టేందుకు ఏపీ పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన దిశ యాప్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సీఎం జగన్ రానున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చివరిసారిగా కర్నూలులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం, విజయవాడలో నూతనంగా నిర్మిస్తున్న ఆలయాలు, కృష్ణానది రిటైనింగ్ వాల్ శంకుస్థాపన కార్యక్రమాలకు మాత్రమే హజరయ్యారు.

    ఈ సదస్సు కోసం గొల్లపూడి పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు గొల్లపూడిలోని పంచాయతీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ మొక్కలు నాటుతారు. తరువాత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐదుగురు మహిళలతో వారి మొబైల్‌ ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయిస్తారు. అన్ని జిల్లాల్లో విద్యార్థినులు, మహిళలతో నిర్వహించే దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ కార్యక్రమాన్ని ఆయన వర్చువల్‌ విధానంలో వీక్షిస్తారు. ఈ సందర్భంగా దిశ యాప్‌ ఆవశ్యకతను వారికి ముఖ్యమంత్రి స్వయంగా చెబుతారు. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలి, పోలీసు వ్యవస్థ వెంటనే ఎలా స్పందించి రక్షణ కల్పిస్తుందన్నది వీడియో స్క్రీన్లపై ప్రదర్శించి వివరిస్తారు.

    దిశ యాప్‌ అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా పాల్గొననుండటం మహిళా భద్రతకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమని చెప్పారు మంత్రి వెల్లంపల్లి. ఇప్పటికే 20 లక్షలమంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం దిశ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
    Published by:Nagesh Paina
    First published: