Union Budget: పార్లమెంట్ లో మన అజెండా అదే.. వైసీపీ ఎంపీలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఫైల్)

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Parliament Budget Session) సమీపిస్తున్నందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Part) ఎంపీలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS JaganmohanReddy) కీలక ఆదేశాలు జారీ చేశారు.

 • Share this:
  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సమీపిస్తున్నందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ ఎంపీలతో భేటీ అయిన జగన్.., పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపైకూడా సమావేశంలో చర్చించారు. రైతులకు కనీస మద్దతు ధర లభించాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు. ఎక్కడ కొనుగోళ్లు జరిగినా రైతుకు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలన్న షరతుతోనే బిల్లులకు మద్దతిచ్చామన్నారు జగన్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో జరిగిన ఘటనలపై సమగ్ర వివరాలతో సిద్ధం కావాలని.. ఈ కేసులో రాజకీయ నేపథ్యాన్ని పార్లమెంట్ లో వివరించడం ద్వారా దేశప్రజల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. దేవాలయాల్లో జరిగిన ఘటనల అంశపై సమగ్ర వివరాలతో సిద్ధంకావాలని ఎంపీలకు సీఎం ఆదేశం. దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం.. సహా వివిధ ఘటనలపై సమగ్ర వివరాలను తెలుసుకుని.., ఆమేరకు పార్లమెంట్ లో చర్చకు సిద్ధం కావాలన్నారు. అంతర్వేది రథం దగ్ధంపై సీబీఐ విచారణ కోరిన అంశాన్ని కూడా పార్లమెంట్ లో ప్రస్తావించాలన్నారు.

  ప్రత్యేక హోదా - పోలవరం

  ఇక పోలవరం సహా పలు కీలక అంశాలను లేవనెత్తాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టుకు ఇంకా రావాల్సిన బకాయిలు రూ.1569.86 కోట్లు, అలాగే ప్రాజెక్టు వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదం రావాల్సి ఉందని సీఎం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, రివైజ్డ్‌ కాస్ట్‌ ఎస్టిమేట్స్‌ ఆమోదానికి గట్టిగా కృషిచేయాలని ఎంపీలను ఆదేశించారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగించాలని.., దీనిపై పార్లమెంట్ లో గళం వినిపించాలని సూచించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న 16 నూతన మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్రం సాయమందించేలా ప్రయత్నించాలన్నారు. ఇక రాష్ట్రానికి టైర్-1 సిటీ లేదన్న సీఎం.., దీని వల్ల ఆస్పత్రులు మౌలిక సదుపాయాల కొరత ఉందన్నారు.

  బకాయిలు-బిల్లులు

  ప్రజాపంపిణీ వ్యవస్థకు ధాన్యం సేకరణ రూపేణా కేంద్రం రూ. 4,282 కోట్ల రూపాయలు బకాయిలు పడిందని, వీటిని వెంటనే ఇప్పించాల్సిందిగా కోరామని ఈ విషయాన్ని కూడా సభలో లేవనెత్తాలన్నారు. అలాగే 14వ, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి రావాల్సిన రూ.1842.45 కోట్ల బకాయిలు రాబట్టే అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాలన్నారు. అలాగే నివర్ తుఫాన్ పరిహారం కింద రూ.2,255.7 కోట్లు రావాల్సి ఉందని ఆ విషయాన్ని కూడా లెవనెత్తాలన్నారు. ఉపాధి హామీ కింద రూ. 3,707.77 కోట్లు బకాయిలు ఉన్నాయని, అలాగే పనిదినాలను 100 నంచి 150కి పెంచాలంటూ విజ్ఞప్తిచేశామని ఈ రెండు అంశాలమీద పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో దృష్టిపెట్టాలన్నారు. రెవిన్యూ లోటు కింద రాష్ట్రానికి రావాల్సిన రూ. 18,830.87 కోట్లు వచ్చేలా పార్లమెంటులో లేవనెత్తాలన్నారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన రూ.700 కోట్లు బకాయిల విడుదలకూ కృషిచేయాలన్న ఆదేశించారు.

  అలాగే ఏపీ దిశా బిల్లు, ఏపీ స్పెషల్ కోర్టుల బిల్లుల ఆమోదానికి కృషి చేయాలని చెప్పారు. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ది బిలులు, కర్నూలుకు హైకోర్టు తరలింపు అంశాలపై రీ నోటిఫికేషన్ జారీ చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. అలాగే బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న బిల్లులపైనా పూర్తి వివరాలతో సిద్ధంకావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అబార్షన్‌ బిల్లుపై సమగ్రవివరాలతో సిద్ధంకావాలని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజయ్‌కు సూచించారు. విశాఖ రైల్వే జోన్‌ ప్రకటించినప్పటికీ డివిజన్లపై నెలకొన్న సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావించాలని సీఎం జగన్ ఆదేశించారు.
  Published by:Purna Chandra
  First published: