ANDHRA PRADESH CHIEF MINISTER YS JAGAN MOHAN REDDY PLANNING TO SHIFT HIS OFFICE TO VISAKHAPATNAM BK NGS
Andhra Pradesh: విశాఖ నుంచి జగన్ పాలన.. జూన్ నుంచే ఆరంభం.. ఆ రిసార్టు సిద్ధం
ఏపీ సీఎం వైఎస్ జగన్(ఫైల్ ఫొటో)
త్వరలో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం కానుందా? అందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా? సీఎం క్యాంపు కార్యాలయం కూడా సిద్ధమైందా? అన్నీ అనుకున్నట్టు కుదిరితే జూన్ మొదటి వారం నుంచే సీఎం జగన్ పాలన వైజాగ్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సీఎం జగన్ త్వరలోనే వైజాగ్ వచ్చేస్తున్నారు.. ఇప్పటి వరకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి జగన్ పాలనా వ్యవహారాలు చూస్తున్నారు. కానీ ఇకపై వైజాగ్ నుంచే పాలన జరిపేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. అందుకు కసరత్తు కూడా పూర్తైనట్టు సమాచారం..
ఆరునూరైన జూన్ మొదటి వారంలో విశాఖపట్నం నుంచి పాలన జరపడానికి ముఖ్యమంత్రి జగన్ రెడీ అయ్యారని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పలు పిటీషన్లు కోర్టులో ఉన్నప్పటికి.. రాజధాని తరలింపు ఆలస్యమైనా సీఎం మాత్రం వైజాగ్ నుంచి పాలన చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ భవనాలు పూర్తిగా సమకూరే వరకు.. పాలనకు ఇబ్బంది లేకుండా.. అంతా అనుకూలంగా ఉండే ప్లేస్ ను ఆయన ఖరారు చేసినట్టు తెలుస్తోంది. జూన్ మొదటి వారంలో కీలక పాలనా విభాగమంత విశాఖపట్నానికి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఉగాధి రోజు శంకుస్థాపన చేసే అవకాశం ఉందని తెలస్తోంది.
మరోవైపు ముఖ్యమంత్రి విశాఖపట్నం వచ్చిన వెంటనే.. అక్కడ నుంచి పరిపాలించేందుకు అన్ని వసతులతో కూడిన క్యాంప్ కార్యలయం స్థానికంగా రెడీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. నగరంలో ఉన్న ప్రముఖ వెల్ నెస్ రిసార్ట్ ను అందుకు ఎంపిక చేశారని తెలుస్తోంది. అది దేశంలోనే మంచి గుర్తింపు పొందిన రిసార్ట్స్ కూడా...
పూర్తిగా అన్ని సదుపాయాలు సమకూరే వరకు ముఖ్యమంత్రి ఇక్కడ నుంచే పరిపాలన కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వైజాగ్ లో చాలా ప్రదేశాలు పాలనకు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఈ రిసార్ట్ ఉన్నది ప్రభుత్వ స్థలం కావడంతో దిన్నే ఎంపిక చేసినట్లు సీఏంవో వర్గాల ద్వారా తెలుస్తోంది.
సుమారు 28 ఎకారాల్లో విస్తరించి ఉన్న ఈ వెల్ నెస్ రిసార్ట్ ను ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో కట్టారు. పూర్తి స్థాయి విలాసావంతమైన సౌకర్యలు ఇందులో ఉన్నాయి. బీచ్ కు అనుకుని ఉండే ఈ రిసార్ట్ మన దేశంలో అత్యంత పేరొందినదిగా గుర్తింపు పొందింది.
మరోవైపు ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా అమరావతిలో రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా వాళ్లకు మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తాజా నిర్ణయం.. ప్రభుత్వాన్ని ఇంకెంత ఇరుకున పెడుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు పార్టీలో కొందరు నేతలు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ముఖ్యమంత్రి జగన్ మోహాన్ రెడ్డి జూన్ మొదటి వారం నుంచే విశాఖ నుంచి పరిపాలన సాగించబోతున్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.