ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఘాటు విమర్శలు చేశారు. నరసరావుపేట ఎన్నికల సభలో పాల్గొన్న అమిత్ షా... చంద్రబాబును పచ్చి అవకాశవాదిగా అభివర్ణించారు. 1999లో బీజేపీ హవా ఉందని గమనించి తమతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు... 2004లో తమ పార్టీ ఓడిపోయిన వెంటనే ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోయారని విమర్శించారు. మళ్లీ 2014లో నరేంద్రమోదీ హవా చూసి మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడంపై అమిత్ షా విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే వారిని కూడా వదిలేస్తారని ఆరోపించారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న చంద్రబాబు... మరోసారి తమతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారని అమిత్ షా విమర్శించారు. అయితే ఎన్డీయేలోకి చంద్రబాబుకు తలుపులు మూసుకుపోయాయని వ్యాఖ్యానించారు. ఏపీకి చంద్రబాబు చేసిందేమీ లేదని అమిత్ షా ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో ఆయన తనయుడు లోకేశ్‌కు తప్ప ఎవరికి మేలు జరగలేదని ఎద్దేవా చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకోలేదని అమిత్ షా అన్నారు.