ఏపీ కేబినెట్ భేటీ నేడే.. సీఎం జగన్ అధ్యక్షతన కీలక నిర్ణయాలు..

AP Cabinet : ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ భేటీ జరగనుంది.

news18-telugu
Updated: March 27, 2020, 6:15 AM IST
ఏపీ కేబినెట్ భేటీ నేడే.. సీఎం జగన్ అధ్యక్షతన కీలక నిర్ణయాలు..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి
  • Share this:
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ భేటీ జరగనుంది. ఈ భేటీలో బడ్జెట్‌ను ఆర్డినెన్స్‌ రూపంలో తీసుకొచ్చే అంశంపై సీఎం, మంత్రులు చర్చించనున్నారు. జూన్ 30 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన ఖర్చులను లెక్కించి ఆ మేరకు ఆర్డినెన్స్ సిద్ధం చేస్తారు. ఆ ఆర్డినెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్‌కు పంపనున్నారు. ఈనెల 31 లోపు గవర్నర్ ఆమోదం తెలపడానికి ఆస్కారం ఉంది.

అయితే, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం సరికాదనే అభిప్రాయం రాజకీయ, అధికార వర్గాల్లో నెలకొంది. బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వారి సహాయకులు.. అధికారులు, వారి సహాయకులు, అసెంబ్లీ సిబ్బంది, భద్రతా సిబ్బంది.. ఇలా పెద్ద సంఖ్యలో అసెంబ్లీకి రావాల్సి వస్తుంది. దీని వల్ల ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే.. ఆర్డినెన్స్‌ ద్వారా బడ్జెట్‌ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

సాధారణంగా మార్చి నాటికి బడ్జెట్‌ సమావేశాలు జరుగుతూ ఉండాలి. కానీ స్థానిక ఎన్నికల కారణంగా పూర్తి స్థాయి బడ్జెట్‌ సమావేశాలకు బదులు ఈ నెలాఖరులో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని జగన్ సర్కారు భావించింది. కానీ, కరోనా దెబ్బకు అది కూడా జరిపే అవకాశం లేనందున ఆర్డినెన్స్ ఆలోచన చేస్తోంది. కాగా, గతంలోనూ రెండుసార్లు ఆర్డినెన్స్‌ ద్వారా బడ్జెట్‌ను తీసుకొచ్చారు. 2004లో అప్పటి సీఎ చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లినపుడు, 2014లో రాష్ట్ర విభజన సమయంలో కొంతకాలం రాష్ట్రపతి పాలన విధించినపుడు ఆర్డినెన్స్‌ ద్వారానే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను తీసుకొచ్చారు.

First published: March 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు