Home /News /politics /

ANDHRA PRADESH CABINET BERTHS WHO WILL BE GET CHANCE TO IN PLACE OF MINSTER AVANTHI SRINIVASA RAO NGS

Cabinet Berths: మంత్రి అవంతి బెర్త్ దక్కేదెవరికి..? రేస్ లో ఉన్నామంటున్న సీనియర్లు

మంత్రి శ్రీనివాసరావు

మంత్రి శ్రీనివాసరావు

Cabinet Berths: ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. వంద శాతం మంత్రుల మార్పు పక్కా అనే సమాచారం రావడంతో.. ఆయా జిల్లాల్లో మంత్రుల స్థానం తమదే అని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. అధిష్టానం అనుగ్రహం తమకే ఉందని ప్రచారం చేసుకుంటున్నారు.. మరి విశాఖ నుంచి మంత్రి అవంతి స్థానం ఎవరికి దక్కుతుంది అన్నదానిపై ఉత్కంఠ పెరిగింది.

ఇంకా చదవండి ...
  Minster Avanthi Srinivas rao: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది?...ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. రెండున్నరేళ్ల తర్వాత సగం మంది మంత్రులను మార్చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే ప్రకటించారు. రెండున్నరేళ్లు త్వరలో పూర్తికాబోతోంది. ఈ నేపథ్యంలో మంత్రులందరినీ మార్చే ఆలోచనలో సీఎం వున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Minster Balineni Srinivasa Reddy) దాదాపు ఆ విషయాన్ని ధ్రువీకరించారు. దీంతో అతి త్వరలోనే మంత్రివర్గ మార్పు వుండవచ్చుననే ప్రచారం జరుగుతోంది. కొత్త మంత్రివర్గంలో జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (Muttamsetti Srinivasa Rao) స్థానంలో ఎవరికి అవకాశం లభిస్తుందనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. మరోవైపు ఆశావహులంతా ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. విశాఖపట్నం నుంచి అందరూ సీనియర్లు, జగన్ కు విధేయులు అవ్వడంతో ఈ సారి అవంతి స్థానంలో ఎవరికి అవకాశం ఇస్తారు అన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎంపీ విజయసాయి రెడ్డి (MP
  vijayasai Reddy)సిఫార్సులు ఎంత వరకు పని చేస్తాయి అన్నది కూడా క్లారిటీ వస్తుంది.

  2019 ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ స్థానాలు దక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. టీడీపీ హయాంలో అనకాపల్లి ఎంపీగా వున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనకు ఇచ్చిన హామీ మేరకు జగన్‌ మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. అయితే రెండున్నరేళ్ల తర్వాత మార్పులు ఉంటాయని, కొత్తవారికి అవకాశం ఇస్తానని సీఎం జగన్‌ ప్రమాణ స్వీకారం సమయంలో ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండున్నరేళ్లు పూర్తికావొస్తుండడంతో మంత్రివర్గ మార్పుపై చర్చ ప్రారంభమైంది. బద్వేలు ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును సమగ్రంగా సమీక్షించిన తర్వాత మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan Mohan Reddy) భావిస్తున్నట్టు తెలిసింది.

  ఇప్పటికే పలు మార్గాల్లో సీఎం జగన్ నివేదికలు తెప్పించుకునట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మంత్రులందరికీ ఉద్వాసన పలికి తనకు అందిన నివేదికల ప్రకారం సమర్థులైనవారు, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు అవకాశాలను మెరుగుపరచ కలిగిన వారికి చోటు కల్పించాలని సీఎం జగన్‌ నిర్ణయించుకున్నట్టు నేతలు చెబుతున్నారు. బద్వేలు ఉప ఎన్నిక ఈ నెల 30న వున్నందున, వచ్చే నెలలో మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ వుంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్థానంలో ఎవరికి పదవి దక్కుతుందనే దానిపై విశ్లేషణలు జోరందుకున్నాయి. జిల్లా నుంచి తిరిగి ఒక్కరికే మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం వున్నందున పోటీ ఎక్కువగా ఉంది.

  ఇదీ చదవండి: 2024 నాటికి ఏపీలో మారనున్న రాజకీయాలు.. ఎవరు ఎవరితో పొత్తుపై క్లారిటీ..?

  జిల్లాలో సీనియర్‌ ఎమ్మెల్యే, ప్రస్తుతం విప్‌, వెలమ సామాజికు వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడు (మాడుగుల)కు ఈసారి మంత్రి పదవి దక్కే అవకాశం వుందని పార్టీ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి కేవలం ముగ్గురు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలుపొందితే వారిలో అరకులోయ, పాడేరు ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరిపోగా మాడుగుల ఎమ్మెల్యేగా గెలుపొందిన బూడి ముత్యాలనాయుడు మాత్రం పార్టీకి విధేయుడిగానే చివరి వరకూ ఉండిపోయారు. దీంతో జగన్‌ వద్ద ముత్యాలనాయుడుకు ప్రత్యేక గుర్తింపు ఉందంటున్నారు. 2019లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముత్యాలనాయుడు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నప్పటికీ... ఎన్నికల ముందు అవంతికి జగన్‌ హామీ ఇచ్చి ఉండడంతో బూడికి అవకాశం చేజారిందంటున్నారు. మరి ఈ సారి అధినేత ఏం చేస్తారో చూడాలి.

  ఇదీ చదవండి: టీడీపీకి బిగ్ షాక్.. ఉన్న ఒక్కటీ పోయింది.. కొంప ముంచిన తెలుగు తమ్ముళ్లు

  అవంతి కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి, తిరిగి అదే సామాజికవర్గానికి అవకాశం కల్పించాల్సి ఉంటుందని.. అలాగైతే అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌కు అవకాశం దక్కుతుందని కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు. సీఎం జగన్‌తో మంచి సంబంధాలు వుండడం అమర్‌కు కలిసి వస్తుందని పేర్కొంటున్నారు. అలాగే చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, బీసీ (తూర్పు కాపు) కోటాలో ధర్మశ్రీ పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

  ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్.. 805 కోట్ల బిల్లులను తిప్పి పంపిన కేంద్రం

  ఇదిలావుండగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మంత్రి పదవిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన బాబూరావు వైఎస్‌ మరణానంతరం జగన్‌ వెంట నడిచారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి వైసీపీ నుంచి ఉప ఎన్నికలో పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత 2014లో ఓటమి పాలైనప్పటికీ 2019లో తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అయినప్పటికీ ఆశ నెరవేరకపోవడంతో రెండున్నరేళ్ల తర్వాత అవకాశం దక్కుతుందని ధీమాతో ఉన్నారు.

  తాజాగా టీటీడీ బోర్డు మెంబబర్‌ పదవి ఇచ్చినప్పటికీ బాబూరావు మంత్రి పదవికి అడ్డువస్తుందనే భావనతో దానిని తిరస్కరించారు. ఇటీవల విజయవాడ వెళ్లి పార్టీ పెద్దలను కలిసి తన మనసులో మాట వెలిబుచ్చారు. ఇక జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రభుత్వ పనితీరుపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. అవకాశం దొరికినచోటల్లా సీఎంతోపాటు మంత్రుల వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో అయ్యన్న దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని మరికొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. వీరిలో ఎవరిని అదృష్టం వరిస్తోందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Politics, Avanti srinivas, Vizag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు