ఆంధ్రప్రదేశ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం మరోసారి తీవ్రరూపం దాల్చుతోంది. కార్మిక సంఘాలకు రాజకీయ పార్టీలు మద్దతిస్తూ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర పార్టీ నిర్ణయాన్ని కేంద్రానికి స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన ఏపీ బీజేపీ నేతలు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని తెలిపారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి... కేంద్ర పెట్రోలియం మరియు ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో భేటీ అయి నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని వినతి పత్రం ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను స్వాగతిస్తున్నామంటూనే.. స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తో తెలుగు ప్రజలకు భావోద్వేగమైన సంబంధం ఉందని.. ఇది దక్షిణ భారతంలోనే అతిపెద్ద పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని లేఖలో పేర్కొన్నారు. ఏపీలోని ముడు వెనుకబడిన జిల్లాల ప్రజలు స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి జీవిసతున్నారని.. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, గిరిజనులు, ఒడిశా, బీహార్ రాష్ట్రాలకు చెందిన పేదలకు స్టీల్ ప్లాంట్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై గత మూడు దశాబ్దాల్లో రూ.4950 కోట్లు పెట్టుబడి పెడితే.. కేంద్రానికి రూ.43,099 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.8,565 కోట్ల మేర వివిధ రూపాల్లో ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో తెలుగు ప్రజల సెంటిమెంట్ ను పరిరక్షించాల్సిన అవసరముందన్న వీర్రాజు.. బ్యాంకుల విలీనం తరహాలోనే స్టీల్ ప్లాంట్ విలీన ప్రతిపాదనలు ధర్మేంద్ర ప్రదాన్ దృష్టితి తీసుకెళ్లినట్లు వివరించారు. స్టీల్ ప్లాంట్ పై రాష్ట్రంలో ఆందోళనలు, పార్టీల వైఖరిని కూడా కేంద్రానికి వివరించినట్లు తెలిపారు.
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో బీజేపీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నిరలతో పాటు తిరుపతి ఉపఎన్నికకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఇది రాష్ట్ర బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. అటు బీజేపీతో పొత్తలో ఉన్న జనసేన పార్టీ కూడా ఇరుకున పడింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవలే కేంద్ర హోమంత్రి అమిత్ షాను కలిసి స్టీల్ ప్లాంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు కూడా తమ నిర్ణయాన్ని చెప్పడంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది. మిత్రపక్షంతో పాటు స్వపక్షం నుంచి కూడా వ్యతిరేకతరావడంతో కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా.. లేక పాలసీ ప్రకారమేనంటూ ముందుకెళ్తుందా అనేది వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.