బాలకృష్ణ బంధువుల పోరు... 'అల్లుడు వర్సెస్ అక్క'

గతంలో కాంగ్రెస్ తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన పురంధేశ్వరి... ఈసారి బీజేపీ తరపున విశాఖ ఎంపీగా బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే విశాఖ బరిలో టీడీపీ తరపున పోటీ చేస్తున్న బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్, ఆయన అక్క పురంధేశ్వరి ఒకరితో ఒకరు పోటీ పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

news18-telugu
Updated: March 19, 2019, 6:59 PM IST
బాలకృష్ణ బంధువుల పోరు... 'అల్లుడు వర్సెస్ అక్క'
బాలకృష్ణ, శ్రీభరత్, పురంధేశ్వరి
  • Share this:
నాయకుల మధ్య బంధుత్వాలు ఎంతగా ఉన్నా... ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో మాత్రం వారికి అవేవీ అడ్డురావు. బంధుత్వం బంధుత్వమే... రాజకీయం రాజకీయమే అన్నట్టుగా నేతలు వ్యవహరిస్తుంటారు. తాజాగా ఏపీ ఎన్నికల్లోనూ ఇలాంటి ఓ ఆసక్తికరమైన ఘట్టం చోటు చేసుకోనుందని తెలుస్తోంది. విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమైన బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌కు టీడీపీ టికెట్ ఖరారు చేసింది. దీనిపై సుదీర్ఘ కసరత్తు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు... ఎట్టకేలకు శ్రీభరత్ పొలిటికల్ ఎంట్రీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

రాజకీయాల్లో రాణించేందుకు ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ రెడీ చేసుకుంటున్న భరత్... విశాఖ మాజీ ఎంపీ అయిన తన తాత ఎంవీవీఎస్ మూర్తి వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న భరత్‌కు పోటీగా వైసీపీ తరపున ఎంవివి సత్యనారాయణ, జనసేన తరపున సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. భరత్‌కు ప్రధాన పోటీగా కూడా వీరితోనే ఉంటుందనే చర్చ జరుగుతోంది. అయితే విశాఖ ఎంపీగా బీజేపీ తరపున బాలకృష్ణ అక్క, ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి బరిలోకి దిగితే పోటీ మరింత రసవత్తరంగా సాగుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గతంలో కాంగ్రెస్ తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన పురంధేశ్వరి... ఈసారి బీజేపీ తరపున విశాఖ ఎంపీగా బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి విశాఖలో ఆమె సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించారనే టాక్ ఉంది. విశాఖ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీగా కంభంపాటి హరిబాబు మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు.

అయితే పురంధేశ్వరి కచ్చితంగా తనకు విశాఖ సీటు కావాలని కోరితే మాత్రం హరిబాబును పక్కనపెట్టి ఆమెకు సీటు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించవచ్చనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే విశాఖ బరిలో బాలకృష్ణ చిన్నల్లుడు, ఆయన అక్క ఒకరితో ఒకరు పోటీ పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే ఇద్దరి మధ్య పోటీ అంతిమంగా ఎవరికి లాభం కలిగిస్తుందనే వాదన కూడా తెరపైకి వస్తుంది. మొత్తానికి విశాఖ బరిలో బీజేపీ తరపున పురంధేశ్వరి నిలిస్తే... విశాఖ ఎంపీ ఎన్నిక బాలకృష్ణ బంధువుల మధ్య పోటీగా ఫోకస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.First published: March 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>