news18-telugu
Updated: October 1, 2020, 1:22 PM IST
ఫ్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా కాకుండా రుణాంధ్రప్రదేశ్‌గా మార్చారని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అప్పుల రూపంలో రూ. 47,130 కోట్లు తెచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ ఐదు నెలల కాలంలో చేసిన అప్పులు, పెట్టిన ఖర్చులు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం నిధులు ఇస్తున్న పధకాలకు కూడా సొంత పేర్లు పెట్టుకుంటున్నారని భానుప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ఎక్కడా కూడా ప్రధాని మోదీ ఫొటో పెట్టడం లేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలోనే హిందూ ఆలయాల పైదాడులు పెరిగాయని ఆయన ఆరోపించారు. మత స్థిమితం లేనివారు కేవలం ఆలయాల పైనే దాడులు చేస్తారా ? అని ప్రశ్నించారు.
వైసీపీతో అలాంటి అనుబంధమేబిజెపికి అన్ని పార్టీలతో ఉన్న అనుబంధమే వైసీపీతో ఉందని ఆయన వివరించారు. ఆ పార్టీతో ప్రత్యేకంగా దగ్గరగా ఉండటం అనేది ఏదీ లేదని క్లారిటీ ఇచ్చారు. బాధ్యత గల పదవిలో ఉన్న మంత్రి కొడాలి నాని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని భానుప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలతో హిందువులు మనోభావాలు దెబ్బ తిన్నాయని వ్యాఖ్యానించారు. కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని సీఎం జగన్‌ను కోరినా స్పందించడం లేదని అన్నారు. తమ పార్టీ నేత దగ్గుబాటి పురంధరేశ్వరికి కూడా కులం ఆపాదించడం సిగ్గు చేటని మండిపడ్డారు. విజయసాయి రెడ్డి, జగన్.. కుల మతాల పేరు చెప్పి విద్వేషాలు రెచ్చ గొడుతున్నారని భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.

ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి(ఫైల్ ఫోటో)
తిరుమల డబ్బు జోలికి వస్తే ఊరుకోం
కుల పిచ్చి మీకు ఎంత ఉందో అందరకీ తెలుసని వ్యాఖ్యానించారు . ఏయే వర్గాలకు ఏ పదవులు ఇచ్చారో చెప్పండని ఆయన డిమాండ్ చేశారు. సిఎం జగన్ ఏపీకి ముఖ్యమంత్రి అని.. ఒక వర్గానికో ప్రాంతానికో కాదని అన్నారు. భక్తులు డబ్బుతో తిరుమల ఆలయం నడుస్తుందని... ఆ డబ్బును తీస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇతర మత సంస్థల నుంచి డబ్బులు తీసుకునే ధైర్యం జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఎక్కడా అప్పు పుట్టే పరిస్థితి లేదు.. అందుకే వెంకన్న సొమ్ముపై కన్నేశారని భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు, పెట్టిన ఖర్చులు పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Published by:
Kishore Akkaladevi
First published:
October 1, 2020, 1:19 PM IST