సీఎం జగన్ మైండ్ గేమ్‌తో బీజేపీకి కలవరం...

డీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులకు కాషాయం కండువా కప్పిన బీజేపీ నేతలు.. అసెంబ్లీలో కూడా తమ ప్రతినిధి ఉంటే బావుంటుందని భావిస్తున్నారు.

news18-telugu
Updated: December 8, 2019, 4:07 PM IST
సీఎం జగన్ మైండ్ గేమ్‌తో బీజేపీకి కలవరం...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌తో బీజేపీకి కలవరం మొదలైంది. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ తరఫున 151 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్ జగన్ మాట్లాడుతూ.. తన పార్టీలోకి రావాలంటే ఎవరైనా ప్రజాప్రతినిధి తన పదవికి రాజీనామా చేసి రావాలని స్పష్టం చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్ మోహన్ రెడ్డి వలసలను అంతగా ప్రోత్సహించకపోవచ్చని రాజకీయనేతలు భావించారు. అయితే, కాలం గడుస్తున్న కొద్దీ జగన్ కొత్త తరహా రాజకీయం మొదలు పెట్టారు. తన పార్టీలోకి రాకపోయినా.. టీడీపీని మాత్రం ఖాళీ చేయించాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. కనీసం చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి పక్కచూపులు చూస్తున్న ఎమ్మెల్యేలకు వల వేస్తున్నారు.

జగన్ తీరుతో బీజేపీకి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులకు కాషాయం కండువా కప్పిన బీజేపీ నేతలు.. అసెంబ్లీలో కూడా తమ ప్రతినిధి ఉంటే బావుంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి భారీ ఎత్తున ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకోవాలని వ్యూహం రచించారు. సుజనా చౌదరి కూడా తమతో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పారు. ప్రజాప్రతినిధుల కంటే ముందుగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతల మీద కూడా బీజేపీ కన్నేసింది. అయితే, వారిని కూడా బీజేపీ గూటికి వెళ్లనివ్వకుండా వైసీపీ నేతలు ఎగరేసుకుపోతున్నారు.

వల్లభనేని వంశీని బీజేపీలోకి తీసుకురావాలని సుజనా చౌదరి ప్లాన్ చేసిన వెంటనే జగన్ అలర్ట్ అయ్యారు. వెంటనే కొడాలి నాని ద్వారా రాజకీయం నడిపించి, ఆయనను వైసీపీలో చేర్చుకోకపోయినా అటు బీజేపీకి, ఇటు టీడీపీకి దూరం చేశారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావును కూడా బీజేపీలోకి తీసుకురావాలని భావించారు. అయితే, అక్కడ కూడా జగన్ గండికొట్టారు. ఇలా ప్రతి సందర్భంలోనూ బీజేపీ కంటే ముందే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>