ANDHRA PRADESH ASSEMBLY PRIVILEGE COMMITTEE DECIDED TO TAKE ACTION ON SEC NIMMAGADDA RAMESH KUMAR OVER MINISTERS COMPLAINT PRN
SEC vs YSRCP: నిమ్మగడ్డకు వైసీపీ ప్రభుత్వం షాక్.. మంత్రుల ఫిర్యాదుపై కీలక నిర్ణయం
నిమ్మగడ్డ రమేష్ కుమార్, జగన్ (ఫైల్ ఫొటో)
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల (Andhra Pradesh Panchayat Elections) వ్యవహారం రోజురోజుకీ ముదురుతోంది. మంత్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్ఈసీ (State Election Commissioner) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ( Nimmagadda Ramesh kumar)పై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల వ్యవహారం రోజురోజుకీ ముదురుతోంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ స్పీకర్ కు ఇచ్చిన నోటీసులపై చర్చించిన ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మంత్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, వాటికి సంబంధించిన గతంలో చోటు చేసుకున్న పరిణామాలు, చట్టపరమైన అంశాలపై సమావేశంలో చర్చించారు. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఘటనల.., అక్కడ ఎస్ఈసీకి శిక్ష విధించిన విధానాన్ని విశ్లేషించారు. ఈ విషయంలో మరోసారి సమావేశమై తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఐతే నిమ్మగడ్డను నేరుగా హాజరై వివరణ కోరతారా? లేక లిఖితపూర్వకంగా వివిరణ అడుగుతారా అనే అంశం ఆసక్తికరంగా మారింది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చర్చించిన అంశాలను ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి వివరించారు. మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుపై స్పీకర్ గవర్నర్ అభిప్రాయాన్ని కోరగా.. రూల్ నం.173 ప్రకారం ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేయాలని గవర్నర్ సూచించినట్లు కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 2006లో మహారాష్ట్రలో అప్పటి ఎస్ఈసీ నందలాల్ – రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగిన కేసుపై చర్చించినట్లు వెల్లడించారు. శాసనసభ్యుల హక్కులను కాపాడే విషయంలో ప్రివిలేజ్ కమిటీకి పూర్తి అధికారాలున్నాయని ఆయన స్పష్టం చేశారు. నిమ్మగడ్డ వ్యవహారంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిమ్మగడ్డ తీసుకున్న చర్యల వల్ల తమకు బాధ కలగలేదని మంత్రులు పేర్కొన్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి వివరించారు. గవర్నర్ కు లేఖరాస్తూ ఉద్దేశపూర్వకంగా మాపై ఆరోపణలు చేశారని.. వాటి వల్లే తమ హక్కులకు భంగం కలిగిందని ఫిర్యాదులో చెప్పారని వివరించారు. ఇందులో ఎలాంటి పక్షపాతం, కక్షసాధింపు లేదని స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో కేసులో ఏం జరిగిందంటే..!
2006లో అప్పటి మహారాష్ట్ర ఎస్ఈసీగా ఉన్న నందలాల్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎమ్మెల్యే జనార్ధన్ చందూకర్ స్పీకర్ కు సభాహక్కుల నోటీసులిచ్చారు. ఎమ్మెల్యే ఇచ్చిన నోటీసులపై విచారణకు స్వీకరించిన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఎస్ఈసీని వివరణ కోరింది. ఎస్ఈసీ విచారణకు హాజరుకాకపోగా.. సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రివిలేజ్ కమిటీ 2008 మార్చిలో ఆయనకు 7 రోజుల జైలు శిక్ష విధించాలని సిఫార్సు చేసింది. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసిన అనంతరం శిక్షను ఖరారు చేశారు. ఐతే సీఎం జోక్యంతో ఆ శిక్ష కాస్తా 2 రోజులకు తగ్గించారు. ఐతే ప్రివిలేజ్ కమిటీ తీర్పును నందలాల్ హైకోర్టులో సవాల్ చేయగా.. 2014లో ఆ పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది. శాసన సభ్యుల హక్కుల ఉల్లంఘన విషయంలో ప్రివిలేజ్ కమిటీకి పూర్తి అధికారాలుంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.