బీసీ జగనగణ చేపట్టాలంటూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ (AP Assembly) తీర్మానించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) కీలక ప్రసంగం చేశారు. బీసీ జనాభా విషయంలో స్పష్టత లేదని.. విద్య, ఉద్యోగాలు, రాజకీయపరంగా బీసీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగన్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీసీ కులాల జనాభా గణన జరగలేదు. సమాజంలో కొద్దిమంది మాత్రమే అధికారాన్ని దక్కించుకుంటున్నారనే భావన.. కొంతమంది సామాజిక, రాజకీయ, ఆర్ధిక రంగాల్లో ఎదగనీయడం లేదన్న భావన వల్ల కులాల పరంగా తమకు న్యాయం చేయాలన్న డిమాంట్లు వినిపిస్తున్నాయని తెలిపారు. సామాజి, విద్య, ఆర్ధిక పరమైన వివక్షకు గురయ్యామన్న భావన కొన్ని వర్గాల్లో ఉందని.. అందుకే వారు తమకు మరింత న్యాయం జరగాలని కోరుతున్నారని జగన్ అన్నారు. అందుకే కొన్ని కులాలు తాము ఎంత జనాభా ఉన్నామని అడిగే పరిస్థితి ఉందన్నారు.
త్వరలో జరగబోయే జనాభా లెక్కల్లో కులాల వివరాలు నమోదు చేసి డేటాను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. బీసీ కులాల జనాభా లెక్కిస్తే బావుంటుందని కొన్ని రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు వెళ్లినా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. రాష్ట్రస్థాయిలో జనాభా గణనకు ప్రత్యేక విధానమంటూ ఏదీ లేకపోవడంతో కేంద్రాన్ని కోరుతున్నట్లు వెల్లడించారు. కేంద్రం కులాల వారీగా జనగణన చేయాలన్న డిమాండ్ కు మద్దతు పలుకుతున్నట్లు జగన్ తెలిపారు.
బీసీ అనేది అనే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని.. ఇది బ్యాక్ బోన్ క్లాస్ అని సీఎం అభివర్ణించారు. గత రెండున్నరేళ్లలో బీసీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా పైకి తీసుకొచ్చేందుకు విప్లవాత్మక మార్పులను అమలు చేస్తున్నామన్నారు. వారికి మరింత మంచి జరగాలంటే బీసీ జనగణన సంపూర్ణంగా అమలైతే మరింత మంచి చేసే అవకాశముంటుందని జగన్ అన్నారు. అందుకనే బీసీ గణన జరగాలన్న తీర్మానాన్ని కేంద్రానికి పంపుతున్నామన్నారు. ఈ డిమాండ్ ను కేంద్రం పరిగణలోకి తీసుకొని బీసీ లేదా ఓబీసీ ప్రాతిపదికన కులాల గణన చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. అధికారంలోకి రాకముందు కూడా బీసీల సంక్షేమంపై తీర్మానం చేసినట్లు గుర్తుచేశారు. బీసీల సంక్షేమం దిశగా ఈ రెండున్నరేళ్ల కాలంలో అడుగులు పడ్డాయన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఏదో చేశామంటే చేశామన్నట్లుగా కొందరికే ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు జగన్ విమర్శించారు. గత ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు చేరాలన్న లక్ష్యం లేదన్నారు. అర్హులందరికీ సంక్షేమం, అభివృద్ధి పథకాలు వర్తింపజేయడమనేది టీడీపీ చరిత్రలో లేదన్నారు. గత ప్రభుత్వ పాలనలో బీసీలను ఓటు వేసినవాళ్లు, ఓటు వేయని వాళ్లుగా విభజించారని జగన్ ఆరోపించారు.
తమ ప్రభుత్వంలో బీసీలందరిని మనవారిగా భావించి ఓటు వేసినా, వేయకపోయినా అర్హత ఉంటే చాలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, ఇళ్లపట్టాల వంటి సంక్షేమ పథరాలను రాజకీయలకు అతీతంగా అమలు చేశామని జగన్ చెప్పారు. ఎక్కడా కూడా లంచాలు, వివక్ష లేకుండా అర్హతే ప్రామాణికంగా తీసుకొని పథకాలిచ్చామని పేర్కొన్నారు. అడుగడుగునా సామాజిక న్యాయం కనిపించేలా చర్యలు తీసుకున్నట్లు సీఎం జగన్ వివరించారు.
ఐదేళ్ల టీడీపీ పాలనలో ఒక్క బీసీ వ్యక్తిని కూడా రాజ్యసభకు పంపలేదని జగన్ విమర్శించారు. తమ హయాంలో నలురుగు రాజ్యసభ సభ్యులకు గానూ ఇద్దర్ని బీసీలను పంపామన్నారు. అలాగే శాసన సభ స్పీకర్ గా బీసీని, మండలి ఛైర్మన్ గా దళితులను కూర్చొబెట్టామన్నారు. అలాగే శాశ్వత బీసీ కమిషన్ ను కూడా నియమించగలిగామన్నారు. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం ఇచ్చేలా చట్టాన్ని చేసిన గత తమ ప్రభుత్వానిదేనని జగన్ అన్నారు. రాష్ట్రంలో 648 మండలాలకు ఎన్నికలు జరిగితే 635 మండలాలను వైసీపీ గెలిచిందని.. అందులో 239 మంది బీసీలకే ఇచ్చామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 67శాతం పదవులిచ్చామన్నారు. 13 జెడ్పీ ఛైర్మన్ పదవులకు గానూ బీసీలకు ఆరు పదవులిచ్చామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Assembly, Ap cm ys jagan mohan reddy, EBC Reservation