హోమ్ /వార్తలు /politics /

AP Capital Issue: అసెంబ్లీ ముందుకు మూడు రాజధానుల రద్దు బిల్లు.. మంత్రి బుగ్గన కీలక ప్రకటన

AP Capital Issue: అసెంబ్లీ ముందుకు మూడు రాజధానుల రద్దు బిల్లు.. మంత్రి బుగ్గన కీలక ప్రకటన

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

మూడు రాజధానుల రద్దు బిల్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly) ముందుకు వచ్చింది. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు రీపిల్ బిల్లును ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో (AP Assembly) ప్రవేశపెట్టారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను బుగ్గన ప్రస్తావించారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్రం ఏర్పాటు చేసిన జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ సుదీర్ఘ సర్వే అనంతరం పలు సూచనలు చేసిందన్నారు. అలాగే జస్టిస్ శివరామకృష్ణన్ కమిటీ కూడా ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని నివేదిక ఇచ్చారని బుగ్గన గుర్తు చేశారు. దేశంలో తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాలు ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణను చేసి చూపించాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మక ప్రభుత్వరంగ సంస్థలన్నీ హైదరాబాద్ లోనే ఏర్పాటు చేయడం వల్ల మహానగరంగా అభివృద్ధి చెందిందన్నారు.

2014లో విభజన జరిగేనాటికి రాష్ట్రం నుంచి 57 వేల కోట్ల సాఫ్ట్ వేర్ ఎగుమతులుంటే.. ఒక్క హైదరాబాద్ నుంచి రూ.56,500 కోట్లు హైదరాబాద్ నుంచే ఉన్నాయన్నారు. వందలాది విద్యాసంస్థలు కూడా హైదరాబాద్ లోనే స్థాపించారన్నారు. అభివృద్ధి అంతా ఒకటే చోట కేంద్రీకృతమవడం వల్ల వేర్పాటు వాదం మొదలైనట్లు జస్టిస్ శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందన్నారు.


ఇది చదవండి: మూడు రాజధానులపై తగ్గేదేలే..! అసెంబ్లీలో సీఎం జగన్ కీలక ప్రకటన


2014లో విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం నేతృత్వంలోని ప్రభుత్వం ఒకేచోట అభివృద్ధి చేయాలన్న నిర్ణయం తీసుకుందన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై అసెంబ్లీలో చర్చించకుండా రాజధానిపై నిర్ణయం తీసుకుందన్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు రాలేదన్నారు. ముంబై కంటే రెట్టింపు స్థాయిలో 7వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధానిని నిర్ణయించారని ఆయన గుర్తుచేశారు. రెవెన్యూ లోటు ఉందని తెలిసినా.. సరైన అభివృద్ధి లేకుండా రాజధాని నిర్మిస్తామని ఊహాజనిత ప్రకటనలు చేశారన్నారు. ముంబైను తలదన్నేలా రాజధాని నిర్మిస్తామని చెప్పి అమాయక రైతుల నుంచి 33వేల ఎకరాలను తీసుకున్నారన్నారు. అలాగే 50వేల ఎకరా అటవీ భూమిని వినియోగించుకుంటామని ప్రతిపాదనలు పెట్టారన్నారు. భవిష్యత్తుపై దృష్టి లేకుండా అన్యాయంగా నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఇది చదవండి: ఇది ఇంటర్వెల్ మాత్రమే.. సినిమా ఇంకా ఉంది... పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు..


2019లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాజధాని పేరుతో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులపై సమీక్ష జరిపి నివేదిక ఇచ్చారన్నారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులతో కూడిన కమిటీని నియమిస్తే.. టీడీపీ ప్రభుత్వం మాత్రం రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారులతో కమిటీ వేశారని ఆరోపించారు. నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తో అభివృద్ధిపై సలహాలు తీసుకున్నామన్నారు.

ఇది చదవండి: ఏపీ మూడు రాజధానుల బిల్లుపై అనూహ్య పరిణామాలు... ఆమోదం నుంచి రద్దు వరకు ఏం జరిగిందంటే..!


తమకు రాజధాని అనే ప్రత్యేకమైన భావన లేదని.. అన్ని ప్రాంతాల అభివృద్ధి మాత్రమే లక్ష్యమన్నారు. 33వేల ఎకరాల రైతుల భూములు, 50వేల ఎకరాల అటవీ భూముల్లో రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల ఖర్చు చేస్తామని చెప్పడమేంటన్నారు. బాహుబలి సినిమా రేంజ్ లో గ్రాఫిక్స్ చూపించారన్నారు. బోస్టన్ కన్సల్టెంగ్ కంపెనీ ఇచ్చిన నివేదికపై మంత్రులతో కూడిన హైపవర్ కమిటీని నియమించినట్లు వెల్లడించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది సరైందని కానీ చంద్రబాబు చెప్పింది తప్పని బుగ్గన విమర్శించారు.

ప్రతి ప్రాంతానికి అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేసి శాసన, పరిపాలన, న్యాయ కార్యకలాపాలకు కేంద్రాలుగా మూడు నగరాలను నిర్ణయించామన్నారు. అందులో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా ఎంపిక చేశామన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని తప్పుబట్టడం సరికాదని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గతంలో కర్నూలు ప్రజలు విశాల హృదయంతో రాజధానిని త్యాగం చేశారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా సీఆర్డీఏను అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీగా మార్చామన్నారు. ఐతే రాజకీయ కారణాల వల్ల ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి ప్రభుత్వ నిర్ణయంపై కేసులు వేశారని విమర్శించారు.

ఇది చదవండి: వివేకా హత్య కేసులో అనూహ్య మలుపు.. అల్లుడిపై సంచలన ఆరోపణలు..


ప్రభుత్వ నిర్ణయంపై ఎవరికి ఎలాంటి సందేహాలున్నా వాటిని నివృత్తి చేసి సమగ్రంగా ముందుకెళ్తామని బుగ్గన ప్రకటించారు. వందకు వందశాతం ప్రజలందరినీ సంతృప్తి పరిచి సరికొత్త ఆంధ్రప్రదేశ్ ను ఆవిష్కృతం చేస్తామని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాలకు చెందిన వారి కలిసిమెలిసి ఉండేలా చేయాలని మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. వికేంద్రీకరణ అనేది ప్రాధిమిక సూత్రంగా పెట్టుకుంటూ అన్ని ప్రాంతాల వారిని భాగస్వాములను చేస్తూ రాష్ట్రాన్ని మంచి మార్గంలో ముందుకు తీసుకెళ్తామని బుగ్గన స్పష్టం చేశారు.

First published:

Tags: Andhra Pradesh, AP Assembly, Ap capital

ఉత్తమ కథలు