Mystery Disease: వింత వ్యాధి వెనుక రాజకీయ కుట్ర.., డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

ఆళ్ల నాని (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పశ్చిమగోదావరి జిల్లాలో (West Godawari) వ్యాపిస్తున్న వింత వ్యాధి (Myster Disease) వ్యవహారం రాజకీయ ములుపు తిరిగింది. దీని వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఆరోపించారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. గత నెలలో ఏలూరులో వందలాది మందిని కమ్మేసిన వింత వ్యాధి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. ముఖ్యంగా భీమడోలు మండలం, పూళ్ల, దెందులూరు మండలం కొమరెపల్లిలో ఒకేరోజు 21 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని బాధిత గ్రామాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. వింత వ్యాధి వెనుక కుట్రకోణం దాగి ఉందన్న డిప్యూటీ సీఎం ఆళ్లనాని కామెంట్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. జనసేన, తెలుగుదేశం పార్టీలపైనే ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బాధితులను ఆస్పత్రికి తరలించే అంబులెన్సులను జనసేన నేతలు అడ్డుకుంటున్నారంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు.

    ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరముందన్నని ఆళ్లనాని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడొద్దని ఆయన హెచ్చరించారు. బాధితుల పట్ల జనసేన నేతలు దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆళ్లనాని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పాలనకు చెడ్డపేరు తెచ్చేందుకే ఇలా చేస్తున్నారని ఆళ్లనాని ఆరోపించారు. దేవుడితో ఆటలాడిన వారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఎరూ క్షమించరన్నారు.

    ఉదయం కొమరెల్లి గ్రామంలో వింత వ్యాధి బాధితులను పరామర్శించేందుకు జనసేన దెందులూరు ఇన్ ఛార్జ్ వెంకటలక్ష్మి అక్కడికి రావడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. జనసేన కార్యకర్యకర్తలు ఆస్పత్రిలోకి రావడంతో బయటకు వెళ్లాల్సిందిగా డాక్టర్లు కోరారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి జనసేన నేతలను బయటకు పంపారు.

    ఐతే వింత వ్యాధిపై కుట్రకోణం దాగి ఉందన్న ఆరోపణళపై జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ స్పందించారు. బాధితుల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్ కు పంపామని.. డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్స్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కుట్రకోణం వెనుక ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అలాంటిదేమైనా ఉంటే ఎవర్నీ ఉపేక్షించే ప్రసక్తే లేదని పశ్చిమగోదావరి ఎస్పీ నారాయణ్ నాయక్ స్పష్టం చేశారు. ఎవరైనా వింత వ్యాధిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు.

    డిప్యూటీ సీఎం ఆళ్లనాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కలకలం రేగుతోంది. ఇప్పటికే హిందూ ఆలయాలపై దాడుల విషయంలో రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా నాని చేసిన వ్యాఖ్యలు మరో పొలిటికల్ వార్ కి తెరలేపారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.  మరి ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
    Published by:Purna Chandra
    First published: