అమృత్సర్ దుర్ఘటనపై సమీక్ష నిర్వహించారు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్. ఘటన జరిగిన 16గంటల తర్వాత ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన అమృత్సర్ చేరుకున్నారు. మంత్రులు, జిల్లా సీనియర్ అధికారులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఘటనపై తాను విచారణకు ఆదేశించానని నాలుగు వారాల్లో దానిపై నివేదిక వస్తుందని తెలిపారు.
'జరిగిన ఘటనపై విచారణ జరిపించాల్సిన అవసరముంది. అందుకే మెజిస్ట్రేట్ ద్వారా దీనిపై విచారణకు ఆదేశించాం. ఘటనకు మీరంటే మీరు బాధ్యులు అని విమర్శించుకునే సందర్భం కాదు ఇది. జరిగిన సంఘటనకు అంతా బాధపడుతున్నాం. అసలు దోషులు ఎవరన్నది విచారణలో తేలుతుంది. అప్పటివరకు ఎవరూ ఎవరిపై ఆరోపణలు చేయకపోవడం మంచిది-అమరీందర్ సింగ్, పంజాబ్ సీఎం
ఘటన జరిగిన 16గంటల తర్వాత అమృత్సర్ చేరుకోవడంపై మీడియా ప్రతినిధులు సీఎం అమరీందర్‌ను ప్రశ్నించారు. దానిపై స్పందించిన అమరీందర్.. నిజానికి తాను ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నానని, ఇంతలోనే అమృత్సర్ ఘటన గురించి తెలిసిందని అన్నారు. ఏదేమైనా ప్రస్తుతం తాము ఇక్కడే ఉండి అన్ని చూసుకుంటున్నామని, సహాయక చర్యలను మంత్రులు పర్యవేక్షిస్తున్నారని అన్నారు.