అమ్మఒడి పథకం అన్ని స్కూళ్లకూ వర్తింపు- జగన్ సర్కారు క్లారిటీ

ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించే ప్రతీ తల్లికి రిపబ్లిక్ దినోత్సవం జోరున 15 వేల రూపాయల సాయం అందించనున్నారు.

news18-telugu
Updated: June 23, 2019, 2:48 PM IST
అమ్మఒడి పథకం అన్ని స్కూళ్లకూ వర్తింపు- జగన్ సర్కారు క్లారిటీ
పిల్లలతో అక్షరాలు దిద్దిస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
ఏపీలో ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్న అమ్మఒడి పథకం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకూ వర్తిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు అమ్మఒడి పథకంపై జరుగుతున్న మిశ్రమ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టింది. గతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా వైఎస్ జగన్ పిల్లలను పాఠశాలలకు పంపే ప్రతీ తల్లికీ ఏటా 15 వేల రూపాయల సాయం అందిస్తామని ప్రకటించారు.

ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు అన్న తేడా లేకుండా అన్ని పాఠశాలలకూ అమ్మ ఒడి పథకాన్ని వర్తింపచేస్తామని ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. గతంలో వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అమ్మఒడి పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించే ప్రతీ తల్లికి రిపబ్లిక్ దినోత్సవం జోరున 15 వేల రూపాయల సాయం అందించనున్నారు. ఇప్పటివరకూ ఈ పథకం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తింపచేస్తారనే ప్రచారం ఉంది. కొద్దిరోజుల క్రితం ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా ఓ మీడియా ఇంటర్వూలో మాట్లాడుతూ ఈ పథకం ప్రభుత్వ పాఠశాలలకే అంటూ ప్రకటించారు. స్వయంగా ఆర్ధిక మంత్రి చేసిన ఈ ప్రకటనతో ప్రైవేటు పాఠశాలలకు పిల్లలను పంపే తల్లితండ్రుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో సీఎం కార్యాలయం స్వయంగా ఇవాళ ప్రకటన జారీ చేసింది.

వైసీపీ మ్యానిఫెస్టో, జగన్ హామీని పక్కనబెడితే వాస్తవానికి అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయాలని పలువురు విద్యావేత్తలు, మేథావులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా ప్రైవేటు స్కూళ్లకూ దీన్ని వర్తింపజేస్తే భవిష్యత్తులో ఏ తల్లీ తండ్రీ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించే అవకాశం ఉండదని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎంచక్కా ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తీసుకుంటూ పిల్లలను ప్రైవేటు ఫాఠశాలల్లో చదివించుకుంటారని, దీని వల్ల ఇప్పటికే కునారిల్లుతున్న ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా మూతపడే ప్రమాదముందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోైవైపు ఈ ఏడాది నుంచి సరిగ్గా రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తామని ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం... అమ్మఒడి పథకం ప్రైవేటు స్కూళ్లకూ అమలు చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలను ఆశిస్తోందో తెలియడం లేదు. ఒకవేళ అమ్మఒడి పథకం సక్సెక్ అయితే ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లే పిల్లలు ప్రైవేటు స్కూళ్లకు తరలిపోతే అన్ని సౌకర్యాలు ఉండీ ప్రభుత్వ పాఠశాలలు మూతపడే అవకాశముంది. అప్పుడు వాటిపై ప్రభుత్వం ఈ రెండేళ్లలో వెచ్చించిన కోట్లాది రూపాయల ప్రజాధనం కూడా నీళ్లపాలై ప్రమాదముంది. అందుకే ప్రభుత్వం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు. ఏదేమైనా ప్రభుత్వం ఎన్నికల హామీపై ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నందున కచ్చితంగా ఏ స్కూల్లో చదివించే పిల్లల తల్లి అయినా ఈ మేరకు అమ్మఒడి పథకం కింద జనవరి 26న 15 వేల రూపాయలు అందుకోనున్నారు.

(సయ్యద్ అహ్మాద్,న్యూస్ 18 తెలుగు,విజయవాడ సీనియర్ కరస్పాండెంట్)
First published: June 23, 2019, 2:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading