జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుతో యువత రక్తపాతానికి ముగింపు పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన చర్చలో విపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలపై రాజ్యసభలో అమిత్ షా సమాధానం ఇచ్చారు. ఆర్టికల్ 370 లేకపోయి ఉంటే వేలాది ప్రాణాలు నిలబడేవన్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు మీద చాలా మంది టెక్నికల్ విషయాలే చెప్పారని, దాని వల్ల జరిగే లాభాలు ఎవరూ చెప్పలేదన్నారు. ఆర్టికల్ 370 మహిళలు, దళితులు, ఆదివాసీలకు విఘాతం లాంటిదన్నారు. దేశ విభజన తర్వాత పాకిస్తాన్ నుంచి వచ్చిన ఎంతో మంది కాశ్మీర్లో స్థిరపడ్డారని, ఇన్నేళ్లు గడిచినా వారికి అక్కడ పౌరసత్వం లభించలేదన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ నుంచి భారత్ వచ్చిన ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్ లాంటి వారు ఏకంగా ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. కాశ్మీర్లో మాత్రం ఎవరూ కనీసం కౌన్సిలర్ కూడా కాలేకపోయారన్నారు. దీని వల్ల ఆర్టికల్ 370 వల్ల జమ్మూకాశ్మీర్‌కు ఎంత నష్టం జరిగిందో అర్థం అవుతుందని అమిత్ షా అన్నారు.
కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల నిధులను జమ్మూకాశ్మీర్‌కు పంపినా.. అక్కడ భారీ ఎత్తున అవకతవకలు జరిగాయన్నారు. అయితే, వాటిపై విచారణ చేసే దర్యాప్తు సంస్థలకు ఎంట్రీ లేనందున అవినీతిని అంతం చేసే అవకాశం లేకపోయిందన్నారు. కాశ్మీర్ వ్యాలీ పర్యాటకం గురించి ప్రపంచం మొత్తం తెలుసన్నారు. అయితే, అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం లేకపోయిందన్నారు. ఆర్టికల్ 370 వల్ల స్టార్ హోటల్ లాంటివి ఏర్పాటు కాలేదన్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఎవరైనా పారిశ్రామిక వేత్త పెద్ద ఇండస్ట్రీని పెట్టాలనుకుంటే కూడా ఈ నిబంధన అడ్డుగా ఉందన్నారు.
ప్రతిపక్షంలో కొందరు జమ్మూకాశ్మీర్ బిల్లుకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లేందుకు పెద్ద ఎన్జీఓ బ్రిగేడ్‌ను రెడీ చేసుకున్నారని అమిత్ షా ఆరోపించారు. అయితే, ఎందరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. న్యాయపరంగా ఈ బిల్లును ఏమీ చేయలేరని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 వల్ల కాశ్మీరీ యువత ఉగ్రవాదంవైపు వెళ్లిపోతోందన్నారు. 1990 నుంచి 2018 వరకు కాశ్మీర్లో 41,894 మంది యువత ప్రాణాలు కోల్పోయారని అమిత్ షా చెప్పారు. ఆర్టికల్ 370ని వెనకేసుకు వచ్చేవారి పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. కాశ్మీర్ వ్యాలీలో యువతకు కూడా ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేసిందన్నారు.
ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక వెసులుబాటు మాత్రమే అని మాజీ ప్రధాని పండిట్ నెహ్రూ చెప్పారని, టెంపరరీ అనేది 70 ఏళ్ల పాటు కొనసాగాలా? అని అమిత్ షా ప్రశ్నించారు. ఆర్టికల్ 370 వల్లే జమ్మూకాశ్మీర్ భారత్‌తో కలసి ఉందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అమిత్ షా అన్నారు. ఆర్టికల్ 370 రద్దు వల్ల స్థానిక సంస్కృతి విఘాతం కలుగుతుందనికొందరు అంటున్నారని, అయితే, దేశంలోని వివిధ రాష్ట్రాలు తమ భాషను, సంస్కృతిని కాపాడుకుంటున్నాయనే విషయాన్ని గుర్తించాలన్నారు.