news18-telugu
Updated: November 4, 2020, 1:16 PM IST
అమిత్ షా(ఫైల్ ఫొటో)
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిని ఈ రోజు ఉదయం మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ అరెస్టును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు, బీజేపీ కీలక నేతలు ఖండించారు. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్ర పక్షాలు దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరో సారి అపహాస్యం చేశాయంటూ అమిత్ షా ధ్వజమెత్తారు. అర్నబ్ అరెస్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. ఈ ఘటనను వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు ప్రజాస్వామ్యం నాలుగవ స్తంభంపై దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. శివసేన ప్రభుత్వం కాంగ్రెస్ ఆదేశాల మేరకు పనిచేస్తోందని విమర్శలు గుప్పించారు. ఈ బలహీనమైన ప్రభుత్వం మహారాష్ట్రను ప్రమాదంలో పడేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడే వారంతా ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని ఫడ్నవీస్ ప్రశ్నించారు. అర్నబ్ అరెస్టుపై కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్ర పోలీసులు పత్రికా స్వేచ్ఛపై దాడి చేశారని ఆరోపించారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటన ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తోందన్నారు.
అయితే ఈ అరెస్టుపై అధికారంలో ఉన్న శివసేన పార్టీ సైతం స్పందించింది. ఈ అంశంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రభుత్వం ఎవరిపై ఎటువంటి ప్రతీకారం తీర్చుకోలేదని అన్నారు. ప్రతీకారం లాంటి పదాలను వివిధ పార్టీల వారు ఈ సందర్భంగా ఉపయోగించడం సముచితం కాదన్నారు. చట్టప్రకారమే అర్నబ్ అరెస్టు జరిగిందని స్పష్టం చేశారు. ఎవరైనా నేరం చేసినట్లు ఆధారాలు ఉంటే పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు.
Published by:
Nikhil Kumar S
First published:
November 4, 2020, 12:55 PM IST