AMID TRS VS BJP SCENCE MP KESAVA RAO WARM HUG WITH ETELA RAJENDER DRAWS POLITICAL ATTENTION MKS
cm kcr కుట్ర.. etela rajender ప్రతీకారం.. trs నం.3 KKతొ ఆలింగనం వెనుక ఇంత కథా?
ఈటలతో కేకే ఆలింగనం
టీఆర్ఎస్ పై ప్రతీకారం తీర్చుకునే దిశగా ఈటల రాజేందర్ ప్రతి అడుగులోనూ కీలకకంగా వ్యవహరిస్తున్నారని కామెంట్లు వస్తుండగా, కాంగ్రెస్ నేత పెళ్లి వేడుకలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతతో ఈటల రాజేందర్ ములాఖత్ వెనుక సీఎం కేసీఆర్ కుట్ర లేకపోలేదని కమలనాథులు అనుమానిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ ముఖ్యనేతలు.. వాళ్లు ఉద్యమకారులై ఉండొచ్చు లేదా జంప్ జిలానీలు అయి ఉండొచ్చు.. ఎవరి ఇంట్లోనైనా శుభకార్యాలు జరిగినా, విషాదకర సంఘటనలు జరిగినా ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా ఆయా జిల్లాలోని నేతల స్వగృహాలకు వెళ్లి పరామర్శించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అదే ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఎంత పెద్ద నేతలు పిలిచినా కేసీఆర్ దాదాపు వెళ్లరు. రోశయ్య లాంటి అజాతశత్రువులు, సీనియర్లు చనిపోయిన సందర్భంలోనే పార్టీలకు అతీతంగా కేసీఆర్ స్పందిస్తుంటారు. గులాబీ బాస్ బాటలోనే టీఆర్ఎస్ ముఖ్యనేతలూ తమ కదలికలపై తగినంత జాగ్రత్త వహిస్తుంటారు. అయితే, టీఆర్ఎస్ లో కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తర్వాత టాప్-3 నేతగా భావించే పార్టీ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నాయకుడైన కే.కేశవరావు మాత్రం ప్రత్యర్థుల ఆహ్వానాన్ని మన్నించి, ఏకంగా కేసీఆర్ తాజా బద్ధశత్రువైన ఈటల రాజేందర్ ను ఆలింగనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు పరస్పరం దెబ్బతీసుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోన్న నేపథ్యంలో ఒక ఫొటో అనేక వాదనలకు తావిచ్చినట్లయింది..
నల్గొండ జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాలుగు రోజుల కిందట సడెన్ గా ప్రగతి భవన్ లో ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపర్చింది. అయితే సీఎం కేసీఆర్ తో కోమటిరెడ్డి భేటీ వెనుక రాజకీయ కారణాలు లేవని, కొడుకు సాంకేత్ రెడ్డి వివాహ వేడుకకు ఆహ్వానించేందుకే కాంగ్రెస్ నేత సీఎంను కలిసినట్లు వెల్లడైంది. సీన్ కట్ చేస్తే, కోమటిరెడ్డి సాకేత్ రెడ్డి-తరుణ్యల వివాహం ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కోమటిరెడ్డి స్వయంగా వెళ్లి ఆహ్వానించినా కేసీఆర్ పెళ్లికి రాలేదు. అయితే, టీఆర్ఎస్ లో టాప్-3నేత కేకే మాత్రం వేడుకలో సందడి చేశారు. కోమటిరెడ్డిది తెలంగాణలో ప్రముఖ రాజకీయ కుటుంబం కావడంతో దాదాపు అన్ని పార్టీల నేతలూ కార్యక్రమానికి వచ్చారు.
కోమటిరెడ్డి కొడుకు పెళ్లిలో టీఆర్ఎస్ ఎంపీ కేకే, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కలుసుకుని, ఆత్మీయ ఆలింగనం చేసుకున్నప్పటి ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈటల-కేకేల గెశ్చర్ అక్కడున్న ఇతరులతోపాటు మీడియా దృష్టినీ ఆకర్షించింది. ఈటలను చూసిన కేకే... ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. నవ్వుతూ పలకరించారు. ఇద్దరి మధ్య సంభాషణ సరదాగా సాగింది. కేకే తన మాస్క్‌తో ఈటలను సరదాగా కొట్టడం అక్కడి వారిలో నవ్వులు పూయించింది. కాగా,
సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురై, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయి, టీఆర్ఎస్ తో రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకొని మరీ ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం, ఆ తర్వాత సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల అన్నట్లుగా హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరు జరగడం, ఎన్నికల్లో గెలుపు తర్వాత టీఆర్ఎస్ ను ఇంకాస్త దెబ్బతీస్తూ ఈటల కీలక మంత్రాంగాలు జరుపుతుండటం, కరీంనగర్ ఎమ్మెల్సీల్లో ఒక సీటు గెలుస్తారా?అనేంతలా గులాబీ దళానికి చుక్కలు చూపిస్తుండటం లాంటి పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఈటలను కలవడం ఇదే తొలిసారి. టీఆర్ఎస్ కీలక నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారన్న ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ, టీఆర్ఎస్ పై ప్రతీకారం తీర్చుకునే దిశగా ఈటల రాజేందర్ ప్రతి అడుగులోనూ కీలకకంగా వ్యవహరిస్తున్నారని కామెంట్లు వస్తుండగా, కాంగ్రెస్ నేత పెళ్లి వేడుకలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతతో ఈటల రాజేందర్ ములాఖత్ వెనుక సీఎం కేసీఆర్ కుట్ర లేకపోలేదని కమలనాథులు అనుమానిస్తున్నారు. మొత్తానికి ఒక మామూలు పలకరిపు.. రాజకీయ కోణాల్లో మాత్రం ఇలా భిన్నంగా చర్చనీయాంశమైంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.