కర్ణాటకలో రాజకీయ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం కుమారస్వామి హుటాహుటిన అమెరికా నుంచి తిరిగి వచ్చారు. వెంటనే బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో జేడీఎస్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ భేటీకి పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడతో పాటు కాంగ్రెస్ నేత, డిప్యూటీ సీఎం పరమేశ్వర, మరికొందరు హస్తం నేతలు హాజరయ్యారు. పార్టీలో ప్రస్తుత సంక్షోభం గురించి చర్చించారు.
మరోవైపు కుమారస్వామి సీఎంగానే కొనసాగాలని, ఆయన రాజీనామా చేయొద్దంటూ జేడీఎస్ కార్యకర్తలు ఆ పార్టీ హెడ్ ఆఫీసు వద్ద నిరసన తెలిపారు. ఇక రాజీనామా చేసి ముంబైలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. తాము అందరం ఒకే మాట మీద నిలబడి ఉన్నామని.. రాజీనామాలపై వెనక్కి తగ్గబోమని రెబల్ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ స్పష్టం చేశారు. ఈ సంక్షోభం మొత్తానికి మాజీ సీఎం సిద్ధరామయ్యే కారణమని జేడీఎస్ ఆరోపిస్తోంది. అయితే, కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వం మీద కానీ, జేడీఎస్ నేతలు దేవెగౌడ, కుమారస్వామి మీద కార్యకర్తలు, నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ సిద్ధరామయ్య ట్వీట్ చేశారు.
ప్రస్తుత సంక్షోభంలో ఏ ఎమ్మెల్యే ఎటువైపు జంప్ అవుతారోననే భయంతో అన్ని పార్టీలు క్యాంప్ రాజకీయాలు మొదలు పెట్టాయి. బీజేపీ నేతలు కూడా తమ పార్టీ ఎమ్మెల్యేల కోసం ఓ హోటల్లో 30 రూమ్లు బుక్ చేసినట్టు చెబుతున్నారు. ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేలు ముంబైలోని ఓ హోటల్లో ఉన్నారు. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఎమ్మెల్యేలను కూడా క్యాంపులకు తరలిస్తున్నాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published:July 07, 2019, 22:20 IST