హోమ్ /వార్తలు /politics /

Amaravathi Lands: సుప్రీం కోర్టులో అమరావతి భూముల కేసు.. ఏపీ ప్రభుత్వ వాదన ఇదే

Amaravathi Lands: సుప్రీం కోర్టులో అమరావతి భూముల కేసు.. ఏపీ ప్రభుత్వ వాదన ఇదే

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

అమరావతి భూముల వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబును వదిలేదే లేదంటోంది ఏపీ ప్రభుత్వం.. అటు టీడీపీ మాత్రం అసలు స్కామే లేదని.. వైవసీపీ కక్ష పూరితంగా కేసులు పెట్టిందని ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ కేసుపై హైకోర్టు స్టే ఇవ్వగా.. దీనిపై సుప్రీంను ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం.. మరి సుప్రీం ముందు ఎలాంటి వాదన వినిపించిందో తెలుసా..?

ఇంకా చదవండి ...

Amaravathi Lands: మరోసారి అమరావతి భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ భూముల్లో భారీగా స్కామ్ జరిగిందని ఆరోపిస్తూ మాజీ సీఎం చంద్రబాబు, అప్పటి మంత్రి నారాయణలపై ఏపీ ప్రభుత్వం.. సీఐడీ, సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. దీనీపై సీఐడీ ఇప్పటికే ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా చంద్రాబు నాయుడు, నారాయణలు విచారణకు హాజరు అవ్వాలంటూ సీఐడీ గతంలో నోటీసులు జారీ చేసింది. అయితే తమ విచారణపై చంద్రబాబు హైకోర్టులో స్క్వాస్ పిటిషన్ వేశారు. అమరావతి భూముల వ్యవహారంపై సీఐడీ, సిట్ దర్యాప్తు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది ప్రభుత్వం. ప్రభుత్వ పిటిషన్‌ను స్వీకరించింది జస్టిస్ వినీత్ బెంచ్‌. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదనలు వినిపించారు. భూముల కొనుగోళ్లపై సీబీఐతో దర్యాప్తు చేయించినా అభ్యంతరం లేదని.. సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ చేయించినా సిద్ధమే అని చెప్పారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించామని వివరించారు.

ఈ వ్యవహారంపై ప్రస్తుత స్థాయిలో సుప్రీం కోర్టు విచారణ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. హైకోర్టులోనే పూర్తి స్థాయిలో విచారణ జరిగితే సరిపోతుందని తెలిపింది. అయితే హైకోర్టులో కౌంటర్ వేసేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా మధ్యంతర ఆదేశాలు జారీ చేయడంతోనే సుప్రీంలో పిటిషన్ వేశామని న్యాయవాది తెలిపారు. విచారణ పూర్తి అయ్యే వరకూ ఎలాంటి చర్యలు చేపట్టబోమని రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చారు. తరువాత పిటిషన్ పై విచారణను ఈ నెల 22కు వాయిదా పడింది.

అసలు వివాదం ఏంటంటే.. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలో ల్కాండ్ స్కామ్ చోటు చేసుకొందని ఏపీ సర్కార్ చెబుతోంది. ఈ మేరకు మంత్రుల కమిటీ ఓ నివేదికను కూడా ఇచ్చింది. అమరావతిలో దళితుల నుంచి భూములను బలవంతంగా లాక్కొని తమ బినామీలకు లబ్ధి చేకూర్చారని చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 166, 167, 217, 120 (బీ) రెడ్‌ విత్‌ 34, 35, 36, 37, ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1), (ఎఫ్‌), (జీ), ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొన్న సీఐడీ.. మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణను ఏ2గా పేర్కొన్నారు. అలాగే కొంత మంది అధికారులు కూడా ఇందులో ఉన్నట్లు పొందుపరిచిన సీఐడీ.. వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు.

దీనిపై అప్పట్లో విచారణకు హాజరుకావాలని చంద్రబాబుకు నోటీసులిచ్చిన అధికారులు.. విచారణకు హాజరుకాకపోయినా, విచారణలో వెల్లడించిన విషయాలతో సంతృప్తి చెందకపోయినా అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపి ఇరుపక్షాల వాదన విన్న హైకోర్టు.. ఈ కేసులో స్టే విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మరి ఈ నెల 22న సుప్రీం ఏం చెపుతుందో చూడాలి..

First published:

Tags: Amaravathi, Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Supreme Court