Chirala Assembly : చీరాల ఎన్నికల సమరంలో ఆమంచి, కరణంలలో గెలిచేది ఎవరు?

మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య శిష్యునిగా భావించే.. ఆమంచి కృష్ణమోహన్ ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. వరుసగా రెండు సార్లు గెలిచిన ఆమంచి.. తెలుగురాజకీయాల్లో అత్యంత సీనియర్, అద్దంకి నియోజకవర్గంలో దశాబ్దాల పాటు వర్గ రాజకీయాలకు కేంద్ర బిందువైన కరణం బలరామకృష్ణ మూర్తి ఎన్నికల సమరంలో తలపడుతుండటంతో ఈ స్థానంలో గెలుపెవరిది అనేదానిపై జిల్లా అంతటా ఆసక్తి నెలకొంది.

news18-telugu
Updated: March 29, 2019, 3:54 PM IST
Chirala Assembly : చీరాల ఎన్నికల సమరంలో ఆమంచి, కరణంలలో గెలిచేది ఎవరు?
ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరామ కృష్ణమూర్తి (Images : Facebook)
  • Share this:
1604 లో మించాల పాపయ్య- మించాల పేరయ్య అనే యాదవ రాజులు చీరాల పట్టణానికి శంకుస్థాపన చేశారు. ఇక్కడ నుంచి చూస్తే సముద్రం తెల్లగా కనిపించడంతో దీనికి క్షీరపురి అనే పేరు కూడా గతంలో ఉండేది. వస్త్ర పరిశ్రమకు పేరుగాంచిన చిన్న బొంబయిగా కీర్తి ఉంది.ప్రకాశం జిల్లాలో చీరాలకు భారతదేశ జాతీయోద్యమ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. 1919లో సాగిన చీరాల- పేరాల ఉద్యమంతో తెలుగువారి దేశభక్తి నినాదం దిక్కులు పిక్కటిల్లేలా దేశమంతా మారుమోగింది. జాతిపిత మహాత్మాగాంధీ సూచనతో పట్టణంలోని సుమారు 15 వేల మంది ప్రజలు.. పట్టణాన్ని వదిలివెల్లి రామ్ నగర్‌ని ఏర్పాటు చేసుకుని 11 నెలల తమ నిరసన తెలిపారు.చీరాల- పేరాల ఉద్యమాన్ని ముందుండి నడిపిన స్వాతంత్య్ర సమరయోధుడు దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్య, భారత చీఫ్ ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన జీవీజి కృష్ణమూర్తి, ఉమ్మడి రాష్ట్రముఖ్యమంత్రి కె.రోశయ్యకు ఈ ప్రాంతంతో అవినాభావ సంబంధం ఉంది.

ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లొ చీరాలలోనే అత్యల్పంగా 1, 90,448 ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లు 97,238, పురుషులు 93,198 మంది ఉండగా... ఇతరులు 12 మంది ఉన్నారు. ఇక్కడ కూడా మహిళా శక్తిదే ఆధిక్యం. సామాజికవర్గాల పరంగా ఇక్కడ చేనేతలు, యాదవ సామాజికవర్గం అభ్యర్థుల గెలుపుని నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తారు. ఆ తరువాత స్థానంలో ఎస్సీలు, ఆర్యవైశ్యసామాజికవర్గ ఓటర్లు ప్రభావం చూపిస్తారు. మిగిలిన సామాజిక వర్గాల వారి ఓటర్ల శాతం తక్కువగా ఉంది. వీరిలో ఆర్యవైశ్యులు, చేనేతల మద్దతు పొందిన వారికే విజయం సాధ్యమని గత ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ తరువాత స్థానంలో ఎస్సీ సామాజికవర్గం ఓటర్లు కీలకంగా ఉంటారు.


మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య శిష్యునిగా భావించే.. ఆమంచి కృష్ణమోహన్ ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. వరుసగా రెండు సార్లు గెలిచిన ఆమంచి.. తెలుగురాజకీయాల్లో అత్యంత సీనియర్, అద్దంకి నియోజకవర్గంలో దశాబ్దాల పాటు వర్గ రాజకీయాలకు కేంద్ర బిందువైన కరణం బలరామకృష్ణ మూర్తి ఎన్నికల సమరంలో తలపడుతుండటంతో ఈ స్థానంలో గెలుపెవరిది అనేదానిపై జిల్లా అంతటా ఆసక్తి నెలకొంది. ఇద్దరూ జిల్లాలో బలమైన కాపు, కమ్మ సామాజికవర్గాలకు చెందిన వారు కావడం, రాజకీయ వ్యూహాలు పన్నడంలో ఉద్దండులు కావడంతో.. ఇక్కడ పోరు హోరా హోరీగా సాగుతూ.. విమర్శలు ప్రతివిమర్శల స్థాయి దాటి.. హైకోర్టుకు కూడా చేరింది.

స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ ఆ తర్వాత టీడీపీలో చేరారు. చివరి నిమిషంలో సీఎం చంద్రబాబు, జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్థన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఆయన వైసీపీలో చేరడంతో టీడీపీ ఈ స్థానంలో ఆమంచిని ఓడించడమే లక్ష్యంగా కరణం బలరామకృష్ణమూర్తిని బరిలో నిలిపింది. దీంతో అక్కడ రాజకీయాలు వేగంగా మారిపోయాయి. నాగార్జునరెడ్డి అనే వ్యక్తిపై దాడిచేసిన కేసులో ఇప్పటికే ఆమంచి కృష్ణమోహన్ సోదరడు స్వాములును అరెస్టు చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. దీనితో అజ్ఞాతంలోకి వెల్లిన

ఆమంచి సోదరుడు స్వాములతో పాటు ఆమంచి కృష్ణమోహన్.. పార్టీ మారడంతో టీడీపీ నేతలు అధికారుల సాయంతో తమను అక్రమకేసుల్లో అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారని హైకోర్టుకు వెళ్లి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని నిన్న సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.దీంతోపాటు.. తమ కార్యకర్తలను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమారు , ఈసీలకు ఫిర్యాదు చేశారు. దీనిపై నిన్న గుంటూరు ఎస్పీ వరదరాజులు చీరాలలో మూడు గంటలపాటు విచారణ నిర్వహించారు.

బీసీ సామాజికవర్గానికి చెందిన యడం బాలాజీ, చేనేత సామాజికవర్గానికి చెందిన ఎంఎల్సీ పోతుల సునీత, యాదవ సామాజికవర్గానికి చెందిన పాలేటి రామారావు టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తిని గెలిపించడానికి కృషి చేస్తున్నారు. కరణం బలరామకృష్ణమూర్తి సొంత ఊరు కావడం.. రాజకీయ ఓనమాలు నేర్చుకున్న ప్రాంతం .. గ్రామాలలో విస్తృత స్థాయి పరిచయాలు ఉండటం... గ్రూపు రాజకీయాలు నడపడంలోనూ.. ఆ గ్రూపులను ఏకం చేయడంలో ఉద్దండుడు కావడం టీడీపీ అభ్యర్థి బలాలు. ఇప్పటికే టీడీపీలోని అసమ్మతి నేతలతో పాటు... వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఉన్న నాయకులను తనకు అనుకూలంగా ఇప్పటికే మలుచుకున్నారు. దీంతోపాటు.. ఇక్కడ నుంచి బలరాం విజయం సాధించి.. టీడీపీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఆయనకు మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఆమంచి కృష్ణమోహన్ కూడా రోశయ్యకు ప్రధాన అనుచరుణిగా ఉండి.. నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు ఏర్పరుచుకున్నారు. బలమైన అనుచరవర్గం ఉండటంతో... పోల్ మేనేజ్ మెంట్ అనుభవం ఉండటం వైసీపీ అభ్యర్థి బలం. ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థి కావడంతో ఆమంచి.. టీడీపీ అభ్యర్థికి గట్టిపోటీ ఇస్తున్నారు. బీజేపీ-వైసీపీలకు పొత్తు ఉందని జిల్లాలో విస్తృతంగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీంతోపాటు.. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్-టీడీపీ కలసిసాగుతున్నాయి. కాంగ్రెస్ వాది అయిన రోశయ్య.. అంతర్గతంగా ఆమంచికి మద్దతుగా నిలుస్తారో లేదో అనేది కూడా కీలకం.
మరోవైపు.. ఇప్పటికే ఆమంచి స్వాములు కుమారుడు, ఆమంచి కృష్ణమోహన్ బావమరిది డబ్బులు పంపిణీ చేస్తున్నారని పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఎక్కువ శాతం చీరాల ఎమ్మెల్యేకి సంబంధించిన చీరలు, డబ్బులు, మద్యం పోలీసులు సోదాల్లోనే దొరకుతుండటంతో.. టీడీపీ నేతలే పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. సోమవారం టీడీపీ గెలుస్తుంది అన్న ఓ ఆటో ప్రయాణికుడిని... కొందరు ఆటోవాలాలు దాడిచేసినట్లు కేసు నమోదు అయింది. ఇప్పటికే మాజీ మంత్రి పాలేటి రామారావు కూడా ఆమంచి అనుచరులపై దాడిచేసినట్లు కేసు నమోదు అంయింది. వరుసగా నమోదవుతున్న కేసులతో జిల్లా ఎస్పీ చీరాలను జిల్లాలోనే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా ప్రకటించి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

వైసీపీ తరఫున ఆమంచి కృష్ణమోహన్, ఆమంచి స్వాముల తమ అనుచరలతో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతుంటే.. టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన కుమారుడు వెంకటేష్, మాజీ మంత్రి పాలేటి రామారావు, ఎంఎల్సీ పోతుల సునీత, వైసీపీ మాజీ ఇంఛార్జి యడం బాలాజీ.. ఆమంచి ఓటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇక్కడ అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే వైశ్య సామాజికవర్గం వారు మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య మాటకు గౌరవం ఇస్తారు. కానీ, ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, టీడీపీ కలసి కొనసాగుతున్నాయి. దీంతో ఆయన తన శిష్యునికి మద్దతుగా నిలుస్తారు.. కాంగ్రెస్ వాదిగా అంతర్గంతంగా టీడీపీకి మద్దతు పలుకుతారా అనేది సస్పెన్స్ గా మారింది. దీంతో నియోజకవర్గంలో గెలుపు ఎవరిదీ అనేది విశ్లేషించడం చాలా కష్టసాధ్యంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
First published: March 26, 2019, 9:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading