ALLEGATIONS THAT SARPANCH CANDIDATE DISTRIBUTING TIRUMALA LADDU PRASADAM AS BRIBE TO VOTERS DURING PANCHAYAT ELECTIONS CAMPAIGN NEAR TITUPATHI OF ANDHRA PRADESH PRN
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల ప్రచారంలో తిరుమల వెంకన్న.. ఓటర్లకు శ్రీవారి లడ్డూల పంపిణీ
శ్రీవారి లడ్డూ ప్రసాదం.. (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల్లో (AP Panchayat Elections) ప్రచారపర్వం తారాస్థాయికి చేరింది. ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు.. ప్రలోభాలకు తెరలేపారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారపర్వం తారాస్థాయికి చేరింది. ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు.. ప్రలోభాలకు తెరలేపారు. ఓటర్లకు బొట్టుపెట్టి ప్రమాణాలు చేయించుకొని సెంటిమెంట్ తో ఓటర్లను గాలం వేయడం చూశాం కానీ. చిత్తూరు జిల్లాలో మాత్రం ఓ అభ్యర్థి పంచాయతీ ఎన్నికల ప్రచారంలో తిరుమల వెంకన్నను లాగారు. ఓటర్లకు ఏకంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. వెంకన్నపై ఉండే భక్తి ఓట్లు కురిపిస్తుందని అభ్యర్థి భావిస్తున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే... చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల, చంద్రగిరి మండలం తొండవాడ గ్రామలాల్లో ఓటర్లకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రేషన్ సరుకుల డోర్ డెలివరీ వాహనాల్లోనే ఇంటింటికీ పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఓ ప్రధాన పార్టీ మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులు లడ్డూ ప్రసాదాన్ని ఓటర్లకు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ప్రలోభాలకు భక్తుల సెంటిమెంట్ తో ముడిపెట్టడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. అలాగే ప్రభుత్వ వాహనాలను వినియోగించడంపైనా విమర్శలు వస్తున్నాయి. తొండవాడ, పుదిపట్ల గ్రామాల్లో ఈనెల 21న పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలకు శ్రీవారిపై ఉండే భక్తిని క్యాష్ చేసుకునేందుకే ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. స్వామివారి ప్రసాదం పంపిణీ చేస్తే ఓట్లన్నీ తమకే పడతాయని అభ్యర్థులు భావించే ఇంటింటికీ లడ్డూలతో కూడిన కవర్లను పంచుతున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ గానీ, స్థానిక రిటర్నింగ్ అధికారులు గానీ స్పందించలేదు.
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో గ్రామాల్లోని ఓటర్లకు నగదు, చీరలు, ఇతర గిఫ్టులు పంచుతున్న ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో వెలుగులోకి వచ్చాయి. కొన్ని చోట్ల ఎన్నికల గుర్తులకు సంబంధించిన వస్తువులను కూడా పంపిణీ చేయగా.. మరికొన్ని చోట్ల చికెన్, మటన్, కోడిగుడ్లు, కోళ్లను ఓటర్లకు పంచారు. కానీ ఇలా శ్రీవాలి లడ్డూలను ప్రలోభాలకు వినియోగించడంపై భక్తులు కూడా మండిపడుతున్నారు. లడ్డూలు పంపిణీ చేసిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం వెరైటీగా ఓ పథకాన్నే ప్రవేశపెట్టారు. పెద్దకడబూరు మండలం, కల్లుకుంట పంచాయతీలో ఓ ప్రధాన పార్టీ మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఓ ప్రాంతంలో ఇంటింటికీ డిష్ కనెక్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 150 ఇళ్లకు ఒక్కో కనెక్షన్ చొప్పున 150 కనెక్షన్లు ఇప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే దీనిపై కొందరు స్థానికులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు చేయగా.. అక్కడి ఓటర్లు మాత్రం తమను ఎవరూ ప్రలోభాలకు గురిచేయలేదని.. తామే కొత్త కనెక్షన్లు తీసుకున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు వెనుదిరగాల్సి వచ్చింది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.