AP Politics: టార్గెట్ అంబటి.. విమర్శలతో ఉక్కిరిబిక్కిరి

వైసీపీ ఫైర్ బ్రాండ్, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబును వరస వివాదాలు వెంటాడుతున్నాయి. ఆయన టార్గెట్ గా సొంత పార్టీతో పాటు ఇతర పార్టీల నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. భూ మాఫియాకు ఆయన అండగా ఉంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

news18-telugu
Updated: September 25, 2020, 10:17 PM IST
AP Politics: టార్గెట్ అంబటి.. విమర్శలతో ఉక్కిరిబిక్కిరి
వైసీపీ నేత అంబటిపై ఆరోపణలు
  • Share this:
అంబటి రాంబాబు.. ఏపీ రాజకీయాల్లో ఆయనో ఫైర్ బ్రాండ్. ఎప్పుడూ తన మాటల తూటాలతో ప్రతిపక్షాలపై ఎదురు దాడి చేస్తారు. తన సెటైర్లు, పంచులతో విపక్షాలను వెంటాడుతారు. వైసీపీ ఆవిర్భావం కంటే ముందు నుంచే ఆయన జగన్ వెంట నడిచి.. పార్టీ ఏర్పాటు తర్వాత కీలక నేతగా ఎదిగారు. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లిలో స్వల్ప తేడాతో ఓడిన అంబటి 2019లో అక్కడి నుంచే విజయం సాధించారు. దీంతో ఎన్నికల అనంతరం అందరూ ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నారు. కానీ జగన్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అయినా అంబటి ఏ మాత్రం వెనక్కుతగ్గకుండా వైసీపీ తరఫున తన వాయిస్ వినిపిస్తూనే వస్తున్నారు.

అయితే ప్రస్తుతం అంబటిని విమర్శలు వెంటాడుతున్నాయి. ఈసారి ప్రతిపక్షాలకు ఆయన టార్గెట్ అయ్యారు. అనేక విమర్శల తూటాలు ఆయన కేంద్రంగానే  పేలుతున్నాయి. ఇటీవల వైసీపీలోని  ఇద్దరు నాయకులు అంబటి మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యవహారం విచారణ దశలో ఉండగానే మరో రెండు వివాదాలు అంబటిని  చుట్టుకున్నాయి. అంబటి బ్యాక్ బోన్ గా సత్తెనపల్లిలో భూ దందా సాగుతుందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అంబటి అండతోనే ఓ స్ధానిక నాయకుడు సర్వే నెంబర్-147లో రెండెకరాల అరవై సెంట్లు భూకబ్జాకు పాల్పడ్డాడని బాధితులు ఆరోపిస్తున్నారు. మరో సర్వే నం. 174లో ఫోర్జరీ సంతకాలు తప్పుడు పత్రాలు రెవెన్యూ లాబీయింగ్ తో భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూ మాఫియా ఏకంగా ఎమ్మెల్యే అంబటి పేరుతోనే  బెదిరింపులకు పాల్పడటం సంచలనంగా మారింది.

కరాలపాడుకు చెందిన ఓ వ్యక్తి బాధితులకు ఫోన్ చేసి స్థలం దగ్గరకు వస్తే చంపుతానంటూ హెచ్చరించటం కలకలం రేపుతోంది. అయితే ఈ మొత్తం వ్యవహారాలు మీడియాకు ఎక్కడంతో స్పందించిన ఆర్డీవో భాస్కరరెడ్డి వివాదాస్పద భూములను పరిశీలించారు. అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా గుర్తించి రెండు సర్వే నంబర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. తప్పులు జరిగాయని ఆర్డీవో స్పష్టం చేసినా ఇప్పటి వరకు ఫోర్జరీ పత్రాలతో పాసుపుస్తకాలు పొందిన వ్యక్తి పై, సహకరించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తనపై వస్తున్న ఆరోపణల నుంచి ఎమ్మెల్యే అంబటి ఎలా బయటపడతారన్న అంశం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
Published by: Nikhil Kumar S
First published: September 25, 2020, 6:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading