ALLEGATIONS COMING THAT SARPANCH CANDIDATE DISTRIBUTE DISH TV CONNECTIONS IN KURNOOL DISTRICT DURING PANCHAYAT ELECTIONS IN ANDHRA PRADESH HERE ARE THE DETAILS PRN
AP Panchayat Elections: ఇంటింటికీ డిష్ టీవీ కనెక్షన్... పంచాయతీ ఎన్నికల్లో కొత్త పథకం..
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల మద్దతుదారులు పోటీపడుతున్నారు. వారు ఏదడిగితే అది ఇచ్చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల పోరు తారస్థాయికి చేరుకుంది. ఇప్పటికే మూడు విడతల్లో పోలింగ్ ముగియగా.. నాలుగో విడతకు రంగం సిద్ధమవుతోంది. ఈనెల 21 పోలింగ్ జరుగుతుండగా.. 19వ తేదీతో ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల మద్దతుదారులు పోటీపడుతున్నారు. వారు ఏదడిగితే అది ఇచ్చేస్తున్నారు. కొందరు డబ్బులతో మరికొందరు చీరలు, బట్టలతో.., ఇంకొందరు చికెన్, మటన్ ఇలా తమకు తోచింది ఓటర్లకు పంచుతున్నారు. ఐతే కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం వెరటీగా ఓ పథకాన్నే ప్రవేశపెట్టారు. పెద్దకడబూరు మండలం, కల్లుకుంట పంచాయతీలో ఓ ప్రధాన పార్టీ మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న సత్యనారాయణ గౌడ్ అనే వ్యక్తి ఓ ప్రాంతంలో ఇంటింటికీ డిష్ కనెక్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తం 150 ఇళ్లకు ఒక్కో కనెక్షన్ చొప్పున 150 కనెక్షన్లు ఇప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే దీనిపై కొందరు స్థానికులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు చేయగా.. అక్కడి ఓటర్లు మాత్రం తమను ఎవరూ ప్రలోభాలకు గురిచేయలేదని.. తామే కొత్త కనెక్షన్లు తీసుకున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు వెనుదిరగాల్సి వచ్చింది.
మూడో విడత ఎన్నికల ముందు అనంతపురం జిల్లా ఉరవకొండ మండల వ్యాప్తంగా ప్రధాన పార్టీల మద్దతుదారులు చికెన్ పంపిణీ చేశారు. అర్ధరాత్రి నుంచే ఇంటింటికీ వెళ్లి టోకెన్లు పంచిన నేతలు.. చికెన్ షాపుకు వెళ్లి ఆ టోకెన్ ఇస్తే అందులో ఎంత ఉంటే అంత అక్కడే ముక్కలుగా కొట్టి ఇచ్చేలా అభ్యర్థులు ఏర్పాట్లు చేశారు. చికెన్ వద్దంటే ఎకంగా ఇంటికో కోడి చొప్పున పంపిణీ చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఇక ముక్క, మందు మాత్రమే కాదు.. అభ్యర్థులు తమ గుర్తులకు సంబంధించిన వస్తువులను కూడా పంపిణీ చేస్తున్నారు. గౌన్లు, మంచాలు, కత్తెర్లు, కుక్కర్లు, గ్యాస్ స్టౌవ్ ఇసా తమకు గుర్తులను బట్టి ఓటర్లకు ఇస్తున్నారు. ఇక డబ్బుల సంగతి సరే సరి.. గ్రామాల్లో ఒక్కొక్క ఓటు కనీసం రూ.500 పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ ఓట్లున్న కుటుంబాలకు డబ్బులు కాకుండా గృహోపకరణాలతో కూడా గాలం వేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే ఓటర్లు తమ అవసరాన్ని బట్టి ఏం కోరుకుంటే అది పంచిపెడుతున్నారు.