బీజేపీ, జనసేన మధ్య పొత్తుకు బీటలు వారిందా?

బీజేపీ, జనసేన పార్టీల మధ్య కీలక అంశాలపై కనీస అజెండా, సమన్వయం కోసం ఓ ఉమ్మడి కమిటీ వేయాలని భావించినా అది ఇంతవరకు పట్టాలు ఎక్కలేదు.

news18-telugu
Updated: February 13, 2020, 4:52 PM IST
బీజేపీ, జనసేన మధ్య పొత్తుకు బీటలు వారిందా?
పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ (File)
  • Share this:
ఏపీలో 2024లో అధికారమే లక్ష్యంగా మూడో ప్రత్యామ్నాయం అవుతామంటూ జతకట్టిన జనసేన, బీజేపీ పొత్తు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రాజధాని తరలింపుతో పాటు పలు కీలక అంశాల్లో బీజేపీ వైఖరితో విభేదిస్తున్న పవన్ నిన్న కర్నూలు పర్యటనలో చేసిన వ్యాఖ్యలు సైతం వారి మధ్య సమన్వయ లోపాన్ని మరోసారి బయటపెట్టాయి. ఇదే పరిస్ధితి కొనసాగితే త్వరలో జరిగే స్ధానిక సంస్ధల ఎన్నికల నాటికి పొత్తు పరిస్ధితి ఏమిటనే అంశం ఇరుపార్టీల్లోనూ ఆందోళన రేపుతోంది.

ఓవైపు తమతో దోస్తీ చేస్తూనే రోజుకో రకంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ను చూసి ఇప్పుడు బీజేపీ నేతలకు చిర్రెత్తుకొస్తోంది. అమరావతి నుంచి ఏపీ రాజధాని ఎలా తరలిస్తారంటూ ప్రశ్నించిన పవన్ కు అది రాష్ట్ర పరిధిలోని అంశమేనంటూ బీజేపీ చేస్తున్న ప్రకటనలు చికాకు కలిగిస్తున్నాయి. ఆ మధ్య ఢిల్లీలో బీజేపీ నేతలను కలిసిన పవన్ కు రాజధాని వ్యవహారంలో అనువసరంగా తమను లాగొద్దంటూ వారు చేసిన సూచన ఇబ్బందికరంగా మారింది. ఆ తర్వాత రాజధాని వ్యవహారంలో కేంద్రం జోక్యం గురించి మాట్లాడటం మానేసిన పవన్.. మిగతా అంశాలపై మాత్రం స్పందిస్తున్నారు. తాజాగా నిన్నటి కర్నూలు పర్యటనలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక కుటుంబానికి మద్దతుగా పవన్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో మైనార్టీలను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ దేశంలో మతం పేరిట రాజకీయాలు చేసే వారిని ప్రజలు సహించబోరని, భారత జట్టుకు ఓ ముస్లింను కెప్టెన్ గా ఎన్నుకున్న దేశం మనదని గుర్తుచేసిన పవన్... చివరికొచ్చేసరికి సీఏఏకు ప్రజలంతా మద్దతివ్వాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. దీంతో అవాక్కవడం బీజేపీ నేతల వంతయింది.

#PawanKalyan, JanaSena, JanaSenaParty, Janasena, APCapitals, ApcapitalIssue, Vizag, Amaravathi, Kurnool
కర్నూలు పర్యటనలో పవన్ కళ్యాణ్
అదే సమయంలో కర్నూలుకి చెందిన బాలికపై అత్యాచారం, హత్యకు గురైనా స్పందించని ప్రభుత్వం న్యాయరాజధాని ఏర్పాటు చేసి ఉపయోగం ఏంటని ప్రశ్నించిన పవన్... కర్నూలుకు హైకోర్టు తరలించడాన్ని తాను వ్యతిరేకించబోనన్నారు. దీంతో కర్నూలుకు హైకోర్టు ఇవ్వడాన్ని పవన్ స్వాగతించారో, వ్యతిరేకిస్తున్నారో తెలియని పరిస్ధితి. వాస్తవానికి శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవించి కర్నూలుకు హైకోర్టు ఇవ్వాలనేది బీజేపీ పాత డిమాండే. అయితే వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే క్రమంలో పవన్ దాన్ని ప్రస్తావించిన తీరు కాషాయ నేతలను షాక్ కు గురి చేసింది.

చలో అసెంబ్లీ సందర్భంగా పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న రైతులతో పవన్ కళ్యాణ్ (File)


ఇలా రాజధాని, హైకోర్టు, సీఏఏ వంటి కీలక వ్యవహారాల్లో పవన్ వ్యవహారశైలి బీజేపీ నేతలకు ఇబ్బందికరంగా మారుతోంది. కేంద్ర, రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతున్న అంశాలపై జనసేనాని ఎప్పుడెలా స్పందిస్తారో తెలియడం లేదని బీజేపీ సీనియర్ నేతలు సైతం చెవులు కొరుక్కుంటున్నారు. వాస్తవానికి ఇరు పార్టీల మధ్య కీలక అంశాలపై కనీస అజెండా, సమన్వయం కోసం ఓ ఉమ్మడి కమిటీ వేయాలని భావించినా అది సాధ్యం కాలేదు. దీంతో ఇరు పార్టీల మధ్య అజెండాతో పాటు ఉమ్మడి ప్రణాళిక విషయంలోనూ చాలా గ్యాప్ కనిపిస్తోంది. ఇదిలాగే కొనసాగితే త్వరలో జరిగే స్ధానిక సంస్ధల ఎన్నికల నాటికి పరిస్ధితి ఏమిటన్నది సస్పెన్స్ గా మారింది.(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: February 13, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు