విశాఖ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని టీడీపీ అభ్యర్థులు కొందరు తనకు అంతగా సహకరించలేదనే భావనలో భరత్ ఉన్నారని... ఇదే అంశంపై ఆయన తన మామ బాలకృష్ణ ముందు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు వినిపించాయి.
ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా లేదా అనే విషయం కాసేపు పక్కనపెడితే... విశాఖలో బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ విజయం సాధిస్తాడా లేదా అనే అంశం కూడా టీడీపీ శ్రేణులు వేధిస్తోంది. ఏపీలోని అనేక లోక్ సభ స్థానాల్లో పోటీ టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా సాగింది. అయితే విశాఖ లోక్ సభ నియోజకవర్గంలో మాత్రం పోటీ టీడీపీ వర్సెస్ వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా సాగింది. జనసేన తరపున సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బరిలోకి దిగడమే ఇందుకు అసలు కారణం. ఓ వైపు బలంగా ఉన్న వైసీపీ, మరోవైపు జనసేన నుంచి బరిలోకి దిగిన లక్ష్మీనారాయణ టీడీపీ అభ్యర్థి భరత్‌ను బాగానే టెన్షన్ పెట్టారు.
దీనికి తోడు తన లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని టీడీపీ అభ్యర్థులు కొందరు తనకు అంతగా సహకరించలేదనే భావనలో భరత్ ఉన్నారని... ఇదే అంశంపై ఆయన తన మామ అయిన బాలకృష్ణ ముందు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు వినిపించాయి. ఇలాంటి ఊహాగానాల నేపథ్యంలో విశాఖ ఎంపీ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థితో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించబోయే సమీక్షా సమావేశంలో భరత్ ఏం చెప్పబోతున్నారనే అంశం టీడీపీ వర్గాల్లో టెన్షన్ పెడుతోంది. సాధారణంగా ఇలాంటి సమావేశాల్లో నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం సహజం.
అయితే భరత్ బాలకృష్ణకు చిన్నల్లుడు కావడంతో... ఆయన ఫిర్యాదు చేస్తే టీడీపీ అధిష్టానం దాని పట్ల ఎలా రియాక్ట్ అవుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఎన్నికల్లో తనకు పెద్దగా సహకరించిన నేతల జాబితాను సిద్ధం చేసుకున్న విశాఖ టీడీపీ అభ్యర్థి భరత్... సమీక్షా సమావేశంలోనే ఆ వివరాలను చంద్రబాబుకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని టీడీపీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం జరగనున్న విశాఖ లోక్ సభ పరిధిలోని స్థానాలకు సంబంధించిన సమీక్షా సమావేశం ఏ రకంగా సాగుతుందనే అంశంపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.