హోమ్ /వార్తలు /National రాజకీయం /

Akhilesh Yadav : యూపీ ఎన్నికలపై SP అధినేత సంచలన నిర్ణయం -సీఎం పోస్టు RLDకి ఇస్తారా?

Akhilesh Yadav : యూపీ ఎన్నికలపై SP అధినేత సంచలన నిర్ణయం -సీఎం పోస్టు RLDకి ఇస్తారా?

అఖిలేష్ యాదవ్ పై ఎఫ్ఐఆర్

అఖిలేష్ యాదవ్ పై ఎఫ్ఐఆర్

ఉత్తరప్రదేశ్ లో రైతుల పార్టీగా పేరున్న ఆర్ఎల్డీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ రాజకీయ చతురత ప్రదర్శిస్తే.. అంతకంటే సంచలన రీతిలో అవసరమైతే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కూడా ఆర్ఎల్డీకే ఇస్తామనే సంకేతాలిస్తూ తాను అసెంబ్లీ బరిలో పోటీ చేయడంలేదని చోటా నేతాజీ ప్రకటించారు..

ఇంకా చదవండి ...

అత్యధిక ఎంపీ సీట్లతో ఢిల్లీలో సర్కారు ఏర్పాటుకు దగ్గరదారిగా భావించే ఉత్తరప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడంలేదంటూ బాంబు పేల్చారాయన. అంతలోనే పార్టీ శ్రేణులకు శుభవార్త కూడా చెప్పారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం తారాస్థాయికి చేరిన వేళ.. రైతు పార్టీగా పేరుపొందిన రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ)తో సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల పొత్తు ఖరారైందని అఖిలేశ్ ప్రకటించారు. కాగా, బలమైన బీజేపీని ఈసారి ఇంటికి పంపుతామంటోన్న ఆయన.. ఎన్నికల రణరంగంలోకి నేరుగా దిగకపోవడంపై అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి..


దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా, 404 అసెంబ్లీ సీట్లున్న ఉత్తరప్రదేశ్ లో మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సోమవారం నాడు రెండు సంచలనల ప్రకటనలు చేశారు. బీజేపీ సిట్టింగ్ సీఎం యోగిని ఢీకొట్టగలిగే సమర్థుడంటూ పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నా.. అఖిలేశ్ మాత్రం అసెంబ్లీ బరిలో పోటీకి దిగబోనని స్పష్టం చేశారు. పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని వెల్లడించారు. అఖిలేశ్ ప్రస్తుతం అజాంఘర్ లోక్ సభ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక,

రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ.. జయంత్ చౌదరి నేతృత్వంలోని ఆర్ఎల్డీతో పొత్తు పెట్టుకుంటుందని అఖిలేశ్ యాదవ్ తెలిపారు. ‘ఎస్పీ-ఆర్ఎల్డీ మధ్య ఎన్నికల పొత్తు ఖరారైంది. ఇక సీట్ల పంపకాలపై చర్చించబోతున్నాం’అని చెప్పారాయన. తద్వారా యూపీ ఎన్నికల్లో పొత్తును ప్రకటించిన రెండో కూటమిగా ఎస్పీ-ఆర్ఎల్డీ నిలిచింది. ఇంతకుముందే, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. భాగీదారి సంకల్ప్ మోర్చా(బీఎస్ఎం)అనే కూటమి ద్వారా 9 స్థానిక పార్టీలతో పొత్తును ప్రకటించారు.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం ఏడాది దాటినా కేంద్రం పట్టించుకోకపోవడంతో రైతు సంఘాలు.. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతి ఎన్నికలో పోరాడుతున్నాయి. యూపీలోనూ యోగిని ఇంటికి పంపేలా తమ కార్యాచరణ ఉంటుందని రైతు సంఘాల నేతలు ఇదివరకే ప్రకటించారు. యూపీలో రైతు ఉద్యమంలో ఆర్ఎల్డీ పార్టీ ముందుభాగాన ఉంది. తూర్పు యూపీలో రైతుల పార్టీగా పేరున్న ఆర్ఎల్డీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ రాజకీయ చతురత ప్రదర్శించారని, అవసరమైతే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కూడా ఆర్ఎల్డీకే ఇస్తామనే సంకేతాలు ఇవ్వడానికే తాను అసెంబ్లీ బరిలో పోటీ చేయడంలేదని అఖిలేశ్ ప్రకటించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Published by:Madhu Kota
First published:

Tags: Akhilesh Yadav, Samajwadi Party, Uttar pradesh, Uttar Pradesh Assembly Elections

ఉత్తమ కథలు