తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలతో రాహుల్ గాంధీ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయం పాలవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఇక కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో తాను ఉండలేనని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)కి సమర్పించారు. అయితే దీన్ని కమిటీ ఏకగ్రీవంగా తిరస్కరించింది. రాహుల్ నాయకత్వం పార్టీకి అవసరమని, ఆయనే పార్టీ చీఫ్‌గా కొనసాగుతారని తేల్చిచెప్పింది. అయినా రాహుల్ మాత్రం తన రూట్ మార్చుకోలేదు. తన ఇక అధ్యక్షుడిగా కొనసాగలేనని పట్టుబట్టి కూర్చున్నారు. పార్టీకి సంబంధించిన ఏ వ్యవహారాల్ని ఆయన అసలు పట్టించుకోవడం లేదు. మొండిగా ముందుకు వెళ్తున్నారు రాహుల్. అంతేకాదు ఆయన పార్టీ సీనియర్లైన అహ్మద్ పటేల్, కె. వేణుగోపాల్‌కు కొత్త అధ్యక్షుడిని వెతికి పెట్టే బాధ్యతల్ని కూడా అప్పగించినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ(ఫైల్ ఫోటో)
ఈనేపథ్యంలో పార్టీలో అంతా కూడా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ శాఖమంత్రి ఏకే ఆంటోని వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనైతే.. పార్టీకి కరెక్ట్ అని చాలామంది అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో ఏకే ఆంటోనిని తాత్కాలిక కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తే.. పార్టీని ఆయన సరిగా చక్కదిద్దుతారని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న చాలా సందర్భాల్లో కూడా ఏకే ఆంటోని ఆదుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన సేవల్ని వాడుకోవాలని హస్తం నేతలు భావిస్తున్నారు.
తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, మణిపూర్, మిజోరం, ఒడిశా, సిక్కిం, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరాఖండ్, అండమాన్ అండ్ నికోబర్, చండీఘర్, దాద్రా నగర్ హవేలి, డామన్ అండ్ డయ్యూలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు. 2014 ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్‌లో కాస్త మెరుగుదల కనిపించినప్పటికీ.. సీట్ల సంఖ్యలో మాత్రం పెద్ద మార్పులు ఏం లేవు. తాజాగా జరిగిన ఎన్నికల్లో 542 పార్లమెంట్ స్థానాల్లో కేవలం 52 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి దక్కాయి. 2014తో దక్కిన సీట్లతో పోల్చితే వీటి మధ్య తేడా కేవలం ఆరు మాత్రమే. దీంతో పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తే బావుంటుందని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. అందుకే గాంధీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కాకుండా... వేరే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా నియమించాలని రాహుల్ భావిస్తున్నట్లు సమాచారం.