AJAY KUMAR HAS SHOWN HIS POLITICAL PROWESS IN DEFEATING PARTY CANDIDATE TATA MADHUSUDAN IN THE LOCAL BODY MLC ELECTIONS KMM VB
MLC Elections: ఒంటిచేత్తో విజయఢంకా.. మంత్రి పువ్వాడ చాతుర్యం.. గెలుపుకు సహకరించినవి ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
MLC Elections: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విజయ పరంపర కొనసాగుతోంది. ఎన్నిక ఏదైనా విజయం తమదేనన్న ధీమా ప్రతి నాయకుడు, కార్యకర్తలో వచ్చేలా చేయగలగడంలో అజయ్‌కుమార్ కృతకృత్యులయ్యారని చెప్పవచ్చు. తాజాగా ఆయన ఒంటిచేత్తో మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విజయ పరంపర కొనసాగుతోంది. ఎన్నిక ఏదైనా విజయం తమదేనన్న ధీమా ప్రతి నాయకుడు, కార్యకర్తలో వచ్చేలా చేయగలగడంలో అజయ్‌కుమార్ కృతకృత్యులయ్యారని చెప్పవచ్చు. తాజాగా ఆయన ఒంటిచేత్తో మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. అధికారం అండగా ఉన్నా.. వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఖమ్మం జిల్లాలో నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఎప్పటికప్పుడు తన రాజకీయ చాణక్యాన్ని.. తాను నమ్ముకున్న పోరాట పంథాను, తెగువను ప్రదర్శిస్తూ ఒక్కో విజయాన్ని పార్టీకి అందిస్తూ వస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి తాతా మధుసూదన్‌ను గెలిపించడంలో అజయ్‌కుమార్ తన రాజకీయ పరిణతిని చూపించారు.
జిల్లా పార్టీలో ఉన్న ఎందరో ఆశావహులు నిరాశకు గురై, పార్టీ అభ్యర్ధికి వ్యతిరేకంగా వనరులు వ్యయం చేసినా, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాకుండా గౌరవ ప్రదమైన మెజారిటీ సాధించడాన్ని రాజకీయ విశ్లేషకులు దీన్ని గొప్ప విజయంగానే పరిగణిస్తున్నారు. ఒకవైపు తెరాసలో మహామహులు ఉన్నా సహాయ నిరాకరణ చేస్తూ ఎప్పటికప్పుడు పరీక్షలు పెడుతున్నా, ఓటర్లందరినీ క్యాంపునకు తరలించడంలోనూ, తాను వ్యక్తిగతంగా హాజరై మరీ వారిని పార్టీ విజయానికి ప్రతి ఒక్కరు చేయాల్సిన కృషిని, అభివృద్ధికి అండగా ఉండాల్సిన అవసరాన్ని పదేపదే చెప్పి మరీ ఓటర్లను ఎక్కడా బెసగకుండా చూసుకోవడంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు.
పార్టీకి ఉన్న ఓట్లలో కొన్ని క్రాస్ అయినట్టు ఫలితాల సరళిని బట్టి రూఢీ అవుతున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో, సంక్లిష్టమైన వాతావరణంలో ఈ విజయాన్ని తక్కువ చేసి చూపలేని పరిస్థితి నెలకొంది. తమ పార్టీకి చెందిన ఓట్లను కొందరు సీనియర్లు వనరులు వ్యయం చేసి మరీ క్రాస్ చేయించారన్న సమాచారం ఉన్నప్పటికీ, ఎవరెన్ని మాట్లాడినా తాను మాత్రం మౌనం వహిస్తూ పార్టీ విజయమే తన విజయంగా పనిచేసుకుపోతున్నారు. నిజానికి జిల్లాలో ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించిన లబ్ద ప్రతిష్టులైన నేతలు ఎందరున్నా.. ఒక విద్యాధికుడు, ఒక సామాన్య కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తిని గెలిపించుకోవడంలో అజయ్‌కుమార్ తన సర్వశక్తులు ఒడ్డారు. నిజానికి పార్టీకి ఉన్న ఓట్ల సంఖ్య రీత్యా ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సి లేనప్పటికీ, జిల్లాలో ఉన్న గ్రూపు తగాదాలు, సహాయ నిరాకరణలు, వెన్నుపోట్ల రీత్యా ఆశించిన స్థాయి విజయాలను సాధించడం కూడా కష్టసాధ్యమవుతున్న పరిస్థితి.
తన వెంట ఎవరున్నా లేకున్నా.. క్యాడర్ దన్ను, అధినేత కేసీఆర్ ఆశీస్సులు.. కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అండతో పార్టీని విజయ తీరాలకు చేరుస్తున్నారు. ముక్కుసూటిగా పోతూ, నమ్ముకున్న వారికి అండగా ఉంటూ సమకాలీన రాజకీయాల్లో తనకంటూ ఓ విలక్షణతను చాటుకుంటున్నారు అజయ్‌కుమార్ పువ్వాడ. నిరంతరం ప్రజలను కలవడానికి ఉత్సాహపడే ఈ నేత, జిల్లాలో ఉన్న ప్రతిరోజూ సామాన్యులను కలవడానికి ఏదో ఒక వంక వెతుక్కుంటారన్న పేరుంది. సామాజికవర్గ పరంగానూ ఒక మూసలో పడిపోకుండా ఎవరైనా నిజాయతీతో, నిక్కచ్చిగా ఉన్న వారినే ఎంచుకుంటూ వస్తున్నారు. దాదాపు ప్రతి సామాజికవర్గమూ అజయ్‌ను తమ సొంత వ్యక్తిగా భావించే స్థాయిలో జనసామాన్యంలో ఆయన కలగలిసి పోతున్నారన్న గుర్తింపు లభించింది.
కమ్యూనిస్టు కుటుంబం నుంచి రెయిజ్ అయినా, వ్యవసాయశాస్త్రం చదివినా.. పబ్లిషింగ్ బిజినెస్ చేసినా.. ఆనక మెడికల్ కళాశాలకు ఛైర్మన్‌గా .. ఎక్కడ ఏ రంగంలో అడుగు పెట్టినా తన అకుంఠిత దీక్షదక్షతలతో విజయ సోపానాలు అధిరోహించారని చెప్పొచ్చు. కార్యకర్తలకు చేరువయ్యే గుణం, ఒక్కసారి కలిసినా పేరు పెట్టి పిలిచేంతగా జనాన్న ప్రేమించే తత్వం అజయ్‌ను కేవలం ఆరేళ్లకే మంత్రి పదవికి దగ్గరయ్యేలా చేసిందని చెప్పవచ్చు. తనకు చెందిన సామాజికవర్గంలో రాష్ట్రంలో ఎందరున్నా సీఎం కేసీఆర్ అజయ్‌కుమార్ మాత్రమే ఎంచుకోవడంలో ప్రధానంగా ఉన్న రీజన్‌గా దీన్ని చెప్పుకోవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
తన నియోజకవర్గంలో ప్రతి నూక్ అండ్ కార్నర్‌కు కలియ తిరుగుతూ ప్రతి ప్రదేశాన్ని గుర్తించి మరీ అభివృద్ధికి చేరువ చేయడంలో అజయ్ సక్సెస్ అయ్యారు. మిషన్ భగీరధ ద్వారా తాగునీటి సరఫరా మొదలు, ఖమ్మంలో ఐటీ హబ్, బస్టాండ్ నిర్మాణం, ఖమ్మంలోని దాదాపు అన్ని రోడ్ల విస్తరణ, మున్నేరుపై చెక్‌డ్యాం నిర్మాణం సహా ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.
వెరసి ప్రజలకు తలలో నాలుకలా ఉంటూ వచ్చిన ప్రతి ఎన్నికలోనూ పార్టీ విజయానికి శ్రమిస్తూ విజయతీరాలకు చేరుస్తున్నారు. ఈ మధ్యనే జరిగిన ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలైనా, అంతకు మునుపు జరిగిన సహకార ఎన్నికలైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా.. ఏదైనా తెరాస విజయమే లక్ష్యంగా అజయ్‌కుమార్ దూకుడుగా ముందుకెళ్తున్నారని చెప్పవచ్చు. పార్టీ కార్యకర్తలకు నేనున్నా అన్న భరోసా ఇస్తూ, నమ్ముకుని కష్టపడిన వారు ఎవరైనా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా కార్యకర్తల కష్టాన్ని గుర్తిస్తున్నారన్న గుర్తింపు పొందారు. ఇలా గతానికి భిన్నంగా గత మూడేళ్లుగా జిల్లా పార్టీలో ఓ స్పష్టమైన మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నది జనం మాట.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.