AHEAD OF PANCHAYAT ELECTIONS YSRCP AND TDP LEADERS MET AP SEC NIMMAGADDA RAMESH KUMAR AND MADE COMPLAINTS ON EACH OTHERS PRN
AP Panchayat Elections: ఇటు టీడీపీ.. అటు వైసీపీ... ఎస్ఈసీ వద్ద ఎన్నికల ‘పంచాయతీ’
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల్లో (AP Panchayat Elections) అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress), ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party)ల మధ్య రాజకీయ యుద్ధం ఓ రేంజ్ లో సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య రాజకీయ యుద్ధం ఓ రేంజ్ లో సాగుతోంది. ఏకగ్రీవాల కోసం వైసీపీ నేతలు పోటీ పడుతుంటే అందుకు ధీటుగా తాము బలపరిచిన అభ్యర్థులను నిలబెట్టేందుకు టీడీపీ యత్నిస్తోంది. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అధికారులు, పోలీసులు కూడా అధికార పార్టీకే వత్తాసు పలుకుతున్నారని మండిపడింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. అటు వైసీపీ కూడా టీడీపీపై ఎస్ఈసీని కలిసి ఫిర్యాదు చేసింది.
గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతల అరాచకాలు ఎక్కువయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చిట్టాబత్తిన చిట్టిబాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గుంటూరులో ఆయనకు వినతిపత్రం అందజేశారు. గుంటూరు జిల్లా చుండూరు మండలంలో నామినేషన్లు వేయాలనుకున్న టీడీపీ సానుభూతిపరుడిని అధికారపార్టీ ప్రోద్బలంతో స్థానిక ఎస్ఐ బెదిరించారన్నారు. జొన్నలగడ్డలో నామినేషన్‌ను వెనక్కి తీసుకోవాలని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, చిలకలూరిపేట పచ్చల రోజారాణిని నామినేషన్ వేయకుండా పోలింగ్ కేంద్రం వద్దే దౌర్జన్యంగా తీసుకెళ్ళారని ఎస్ఈసీ దృష్టికి తెచ్చారు. దాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు ఎన్నికల ప్రవర్తనానియమావళిని ఉల్లంఘించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. రాజకీయ పార్టీలకు సంబంధంలేని పంచాయతీ ఎన్నికల్లో మేనిఫెస్టోను విడుదల చేయడం సరికాదని పేర్కొన్నారు. అలాగే ఒక రాజకీయ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోని ఎన్నికల కమిషనర్ రద్దు చేయడం హాస్యాస్పదనమని.. నిబంధనలకు విరుద్ధం మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబునాయుడుపై చర్యలు తీసుకోకపోవడం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.
(Source: Surya Paper)
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.