Home /News /politics /

ముఖ్యమంత్రి అభ్యర్థిగా Etela Rajender -గురి తప్పని ఈటెకు మరింత పదును పెట్టేలా BJP భారీ వ్యూహం?

ముఖ్యమంత్రి అభ్యర్థిగా Etela Rajender -గురి తప్పని ఈటెకు మరింత పదును పెట్టేలా BJP భారీ వ్యూహం?

ఈటల రాజేందర్

ఈటల రాజేందర్

తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం ఉన్న నేతలందరిలోకీ సుదీర్గ ఎన్నికల, పరిపాలన అనుభవం ఉన్న ఏకైక నేత అయిన రాజేందర్ కు ‘ముఖ్య’స్థానాన్ని కట్టబెట్టనున్నారా? టీఆర్ఎస్ లొసుగులపై స్పష్టమై అవగాహన వ్యక్తిగా, అన్ని వర్గాల ప్రజలతో ప్రజలతో కలుపుగోలుగా ఉండే నేతగా..

ఇంకా చదవండి ...
ఈటల రాజేందర్ వర్సెస్ సీఎం కేసీఆర్ అన్నట్లుగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు తర్వాత బీజేపీ తన వ్యూహాలకు మరింత పదునుపెడుతోందా? బీజేపీ యేతర ముఖ్యమంత్రుల్లో అన్ని రకాలుగా బలవంతుడైన కేసీఆర్ ను నేరుగా ఢీకొట్టిన ఈటలకు కమలదళంలో కీలక ప్రాధాన్యం దక్కనుందా? తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం ఉన్న నేతలందరిలోకీ సుదీర్గ ఎన్నికల, పరిపాలన అనుభవం ఉన్న ఏకైక నేత అయిన రాజేందర్ కు ‘ముఖ్య’స్థానాన్ని కట్టబెట్టనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక విజయం ఇచ్చిన జోష్ ను ఇలాగే కొనసాగిస్తూ, కుల సమీకరణాలను మరింత అనుకూలంగా మార్చుకుంటూ, ఉన్నవాళ్లలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత ముఖంతోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి

తెలంగాణ పొలిటికల్ ఫిలాసఫీ
బీజేపీ లాంటి జాతీయ పార్టీలో వ్యక్తులు కేంద్రంగా రాజకీయాలు సాగవు. ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరేది బీజేపీగానీ, కాంగ్రెస్ గానీ ముందే ప్రకటించవు. సరిగ్గా దీనికి విరుద్దమైన విధానాన్ని అవలంభిస్తాయి ప్రాంతీయ పార్టీలు. అయితే, ఈటల గెలుపు తర్వాత బీజేపీ తెలంగాణ వరకైనా తన వ్యూహాన్ని మార్చుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణ జనాభాలో 80శాతంగా ఉన్న బీసీ, ఎస్టీ, ఎస్టీలకు ఆకట్టుకోడానికి ఈటల లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నేత అవసరం ఎంతైన ఉందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈటల కంటే సమర్థుడైన సీఎం అభ్యర్థి మరొకరు లేరని, హిందూత్వ భావజాలంతో కంటే కూడా, తెలంగాణలో వేళ్లూనుకుపోయిన వామపక్ష, బహుజన పొలిటికల్ ఫిలాసఫీని ఒంటపట్టించుకన్న ఈటల లాంటి నేతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టడం తేలిక అవుతుందనే వాదన కూడా వినిపిస్తోంది.

ఈటల దెబ్బకు కేసీఆర్ వరుస నిర్ణయాలు
ఉద్యమాల గడ్డగా పేరుపొందిన తెలంగాణలో.. నిజాంకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ పల్లెల్లో అనూమ్య మార్పులు తీసుకొచ్చిన నక్సలైట్ ఉద్యమం, బహుజన కులాల్లో రాజకీయ చైతన్యం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగగా, వీటిలో తన జీవితకాలంలో జరిగిన అన్ని ఉద్యమాల్లోనూ ఈటల పాలుపంచుకున్నారు. లెఫ్ట్ పార్టీలతోనే పొలిటికల్ కెరీర్ ఆరంభించిన ఈటల, తెలంగాణ ఉద్యమంలో, తర్వాత ప్రభుత్వంలోనూ బీసీలకు ప్రతినిధిగా ఉండేవారు. ఒక దశలో కేసీఆర్ తర్వాత సీఎం అయ్యేది ఈటలే అనే ప్రచారం జరగడం, రాజేందర్ సైతం ‘గులాబీ జెండాకు మేమే ఓనర్లం’అని దూకుడు ప్రకటన చేయడంతో చివరికి ఆయనే టార్గెట్ అయ్యారు. తర్వాతి కాలంలో నిరూపించలేకపోయిన భూకబ్జా ఆరోపణలపై ఈటలను బర్తరఫ్ చేయడంతో కేసీఆర్ ఆయనను కార్నర్ చేశారనే సింపతీ ప్రజల్లో వ్యక్తమైంది. నిజానికి ఈటలను బహిష్కరించిన తర్వాత, ఆయన విసిరిన మాటల తూటాలు చాలా వరకు కేసీఆర్ కు బలంగా తాకడం, ఆ దెబ్బకు కేసీఆర్ ఎన్నడూ చూడలేనటువంటి నిర్ణయాలు తీసుకోవడం తెలిసిందే. సీఎంవోలో దళిత అధికారి నియామకం దగ్గర్నుంచి దళిత బంధు పథకం దాకా ఇటీవల కేసీఆర్ మొదలు పెట్టిన అన్ని పనులూ ఈటల ఎఫెక్ట్ వల్లే జరిగాయన్నది నిర్వివాదాంశంమనే చర్చ జరుగుతోంది.

సంక్షమే అజెండాతో పోరుబాట
హుజూరాబాద్ వేదికగా సీఎం కేసీఆర్ ను ఢీకొట్టడంలో సఫలీకృతుడైన ఈటల రాజేందర్.. బీజేపీ ఎమ్మెల్యేగా తాను ఏ అజెండాతో పనిచేయబోతున్నానో స్పష్టం చేసిన తీరును కూడా ప్రజలు ఆసక్తిగా గమనించారని, తాను ఎప్పటికీ ఉద్యమ బిడ్డనే అని, దళిత బంధును రాష్ట్రమంతటా అమలు చేసేలా కేసీఆర్ మెడలు వంచుతానని, సంక్షేమ పథకాలు అందరికీ చేరేదాకా పోరాడుతానని, నిరంకుశ దొరను గద్దెదించేదాకా నిద్రపోననంటూ ఈటల చెప్పిన మాటల వెనుక దీర్ఘకాలిక వ్యూహాలున్నట్లుగా అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్ తో కలిసి 20 ఏళ్లు ప్రయాణించిన వ్యక్తిగా టీఆర్ఎస్ లొసుగులపై స్పష్టమై అవగాహన, అన్ని వర్గాల ప్రజలతో ప్రజలతో కలుపుగోలుగా ఉండే నేత అనే పేరు, బీజేపీ పట్ల బహుజనుల అభిప్రాయాన్ని మరోలా మార్చేయగల సత్తా, అన్నిటికీ మించి, వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం.. రాజకీయ విలువలు, నిబద్ధతతో కూడిన నేతగా ఈటలకున్న ఇమేజ్ బీజేపీకి కచ్చితంగా ప్లస్ అవుతుందనే వాదన వినిపిస్తోంది. అదీగాక..

బీజేపీ సోషల్ ఇంజనీరింగ్
దేశంలోని ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలోనే స్థానిక సామాజిక సమీరణలు రూపొందించడంలో బీజేపీది అందెవేసిన చేయి. గడిచిన రెండు దశాబ్దాల్లో ఆ పార్టీ ఎదిగిన తీరు, ఒక్కొక్కటిగా రాష్ట్రాలను గెలుచుకుంటూ వచ్చిన విధానాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తే.. బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ ఏ మేరకు సక్సెస్ సాధించిందో ఇట్లే అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలోనూ ఆ విధాన్ని అవలంభిస్తూనే, దక్షిణాదిలో సెంటిమెంట్ గా భావించే వ్యక్తి ప్రాధాన్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో బీజేపీ నిజంగానే తెలంగాణలో తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈటలను నిలుపుతుందా? లేదా? అనేదానిపై రాబోయే రోజుల్లో స్పష్టత వస్తుంది.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Etela rajender, Huzurabad, Huzurabad By-election 2021

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు