news18
Updated: November 17, 2020, 11:30 AM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
November 17, 2020, 11:30 AM IST
‘ఆ పార్టీలో లీడర్లుండరు.. అందరూ సీఎం క్యాండిడేట్లే..! అంతర్గత కుమ్ములాటలంటేనే కాంగ్రెస్..!! రాజకీయాలు ఎలా చేయకూడదో తెలుసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని చూస్తే చాలు..!! ఆ పార్టీ అంతే.. ఎవరికి వారే యమునా తీరే....!’ ఇవన్నీ కాంగ్రెస్ గురించి జనాలు చర్చించుకుంటున్న మాటలు. దశాబ్దాల పార్టీగా చెప్పుకుంటున్నా.. ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అంచుకైనా కనిపించదు. ఎప్పుడూ వివాదాలే. నాయకుల మధ్య ఎప్పుడు విబేధాలే. సుమారు అరవై ఐదేండ్ల పాటు దేశాన్ని పాలించిన ఆ పార్టీ.. ఆరేండ్లుగా తిరస్కరణకు గురవుతూనే ఉంది. 2014 నుంచి ఆ పార్టీకి బ్యాడ్ టైం నడుస్తూనే ఉంది. ఇది చూసిన కాంగ్రెస్ ఘనాపాఠీలు... నాయకత్వ మార్పుపై, పార్టీ సమర్థతపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినా అధినాయకత్వం ఎప్పటిలాగే ఎవరినెక్కడుంచాలో అక్కడే ఉంచుతూ.. నాన్చుడు ధోరణికి కొత్త అర్థాలను చెబుతున్నది. తాజాగా బీహార్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కపిల్ సిబాల్ వ్యాఖ్యలు ఆ పార్టీలో అంతర్గీత విబేధాలను మరోసారి రచ్చకెక్కిస్తున్నాయి.
బీహార్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేతలు మరోసారి గళం పెంచుతున్నారు. ఇప్పటికైనా ‘మీరు మారాలి’ అంటూ అధినాయకత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. పార్టీకి పునరుత్తేజం రావాలంటే అనుభవంతో కూడిన ఆలోచనలు చేయాలని.. దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని సూచిస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
కపిల్ సిబాల్ రేపిన కాక..
ఇదే విషయమై ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ స్పందించారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ దారుణ ఓటమిని ప్రస్తావిస్తూ.. ‘ఇకనైనా ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిద’ని.. లేకుంటే ఇప్పటికే పడుతూ లేస్తూ వస్తున్న కాంగ్రెస్ నావ పూర్తిగా మునగడం ఖాయమని హెచ్చరించారు. ప్రజలు తమను బీజేపీకి ప్రత్యామ్యాయ శక్తిగా గుర్తించడం లేదని సంచలన కామెంట్స్ చేశారు. దశాబ్దాల చరిత్ర కలిగిన తమ పార్టీకి పునరుత్తేజం రావాలంటే.. రాజకీయాల్లో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునే వ్యక్తి కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
పలువురు సీనియర్లదీ అదే బాట...
బీహార్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో అంతర్గత విబేధాలు రచ్చకెక్కిన విషయం విదితమే. ఈ ఏడాది ఆగస్టులో.. పార్టీ అధినాయకత్వంపై 23 మంది సీనియర్లు అసమ్మతి గళం వినిపించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. పలువురు సీనియర్లు సోనియాగాంధీకి లేఖ కూడా రాశారు. మార్పులు రాకుంటే పార్టీ మనుగడ కష్టమని సూచించారు. ఈ వ్యవహారంలో గులాం నబీ ఆజాద్ ను బలిపశువు చేసింది కాంగ్రెస్. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ అగ్ర నాయకత్వం మీద.. సోనియా, రాహుల్ మీద గుర్రుగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ మంటను చల్లార్చినా.. అదీ మూడు రోజుల మురిపమే అయింది.
బీహార్ ఫలితాలతో గళాలు వినిపిస్తున్న నేతలు...
బీహార్ ఫలితాలతో పాటు పలు రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయం పాలైంది. ఈ ఎన్నికలను రాహుల్ గాంధీ సీరియస్ గా తీసుకోలేదని ఆర్జేడీ నేత ఒకరు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీకి ఎన్నికల కంటే విహారయాత్రలంటేనే మక్కువని ఆరోపించారు. ఆర్జేడీ ఓటమికి అక్కడ కాంగ్రెస్సే కారణమనే వాదనలున్నాయి. ఇదే నేపథ్యంలో.. పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా గళాలు విప్పుతున్నారు. కపిల్ సిబాల్ తో పాటు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారాయి. పార్టీ అధినాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలని.. ఆయన ట్వీట్ చేశారు.

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (ఫైల్ ఫోటో)
ఖండించే నేతలూ ఉన్నారు...
కపిల్ సిబాల్ పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి వీర విధేయుడిగా ఉన్న ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని ఐక్యంగా ఉంచగలిగేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని, పార్టీ అంతర్గత సమస్యలను బహిరంగంగా ప్రస్తావించడం మంచి పద్దతి కాదని సిబాల్ కు హితువు పలికారు. ఇవి కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దారుణంగా దెబ్బతీస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. 1966, 1977, 1989 సహా.. 1996 లోనూ కాంగ్రెస్ ఇంతకంటే ఘోరమైన సంక్షోభాలను ఎదుర్కుని నిలిచిందని ఆయన అన్నారు. ప్రతిసారి వ్యక్తుల వ్యక్తిగత భావజాలాన్ని పార్టీ మీద రుద్దడం సరికాదని సిబాల్ కు హితువు పలికారు.
ఏదెలా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం కోసం నాయకత్వ మార్పు తప్పనిదనే వాదనలు ఎప్పట్నుంచో వినబడుతున్నాయి. రాహుల్ గాంధీకి రాజకీయాలు అచ్చిరావనే సంగతిని కాంగ్రెస్ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రియాంక గాంధీకి ఈ బాధ్యతలు అప్పగించాలని వాదనలు వినిపిస్తున్నా.. ఆమె కూడా దానిపై స్పష్టంగా చెప్పడం లేదు. ఈ బాధ్యతను అధినాయకత్వమే చూసుకుంటుందని రాహుల్ కాడి వదిలేశాడు. మరి.. ఈ సంక్షోభాలన్నింటినీ తట్టుకుని కాంగ్రెస్ రేసులో ఉంటుందో లేదో కాలమే నిర్ణయించాలి.
Published by:
Srinivas Munigala
First published:
November 17, 2020, 11:25 AM IST