జగన్ ప్రభుత్వానికి వరల్డ్ బ్యాంక్ బంపర్ ఆఫర్

Amaravati | రాజధాని అమరావతిని పక్కనబెట్టి మరో ఇతర పట్టణ మౌలిక సౌకర్యాల కల్పన ప్రాజెక్టుకైనా ఇదే మొత్తాన్ని, అవసరమైతే అంత కంటే ఎక్కువైనా ఇచ్చేందుకు సిద్ధమని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇచ్చింది.

news18-telugu
Updated: July 21, 2019, 6:35 PM IST
జగన్ ప్రభుత్వానికి వరల్డ్ బ్యాంక్ బంపర్ ఆఫర్
వరల్డ్ బ్యాంక్ (File )
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతికి 300 మిలియన్ డాలర్ల రుణాన్ని రద్దు చేసిన ప్రపంచబ్యాంకు.. ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాజధాని అమరావతిని పక్కనబెట్టి మరో ఇతర పట్టణ మౌలిక సౌకర్యాల కల్పన ప్రాజెక్టుకైనా ఇదే మొత్తాన్ని, అవసరమైతే అంత కంటే ఎక్కువైనా ఇచ్చేందుకు సిద్ధమని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇచ్చింది. దీంతో ప్రభుత్వం మరికొన్ని ప్రత్యామ్నాయాలను సూచించేందుకు సిద్ధమవుతోంది. ఏపీలో గత టీడీపీ సర్కారు హయాంలో రాజధాని అమరావతి భూసేకరణ పేరుతో జరిగిన అవకతవకలపై స్పందించిన ప్రపంచబ్యాంకు... అప్పట్లో ప్రతిపాదించిన 300 మిలియన్ డాలర్ల రుణాన్ని రద్దు చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపుల మేరకు రాష్ట్రంలో మరో ఇతర ప్రాధాన్యతా ప్రాజెక్టుకు ఇంతే మొత్తాన్ని లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధమని ప్రపంచబ్యాంకు ప్రతిపాదించింది. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ సీనియర్ అధికారి న్యూస్ 18కు తెలిపారు. గత ప్రభుత్వంలో రాజధాని భూసేకరణలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని, భూసమీకరణ పేరుతో కోట్ల రూపాయలు విలువ చేసే తమ పంట భూములను బలవంతంగా ప్రభుత్వం లాక్కుందని ఈ ప్రాంతానికి చెందిన పలువురు రైతులు, స్వచ్ఛంద సంస్ధలు ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదు చేశారు.

అమరావతిలో ఫిర్యాదులపై 2017లోనే విచారణ చేపట్టిన ప్రపంచబ్యాంకు బృందం... రుణ వితరణ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. చివరకు ఈ ఏడాది జూన్ లో వైసీపీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని భూ వ్యవహారంపై తమ నిర్ణయం చెప్పాలని జగన్ సర్కారుకు ప్రపంచబ్యాంకు లేఖ రాసింది. దీనిపై ఇప్పటికిప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని జగన్ ప్రభుత్వం కేంద్ర ఆర్ధిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రపంచబ్యాంకుకు సమాధానం పంపింది. అదే సమయంలో కేంద్రం కూడా రాజధానికి గతంలో ఇచ్చిన ఆర్ధిక పరమైన అనుమతులను రద్దు చేస్తున్నట్లు ప్రపంచబ్యాంకుకు తెలపడంతో 300 మిలియన్ డాలర్ల రుణాన్ని రద్దు చేస్తూ ప్రపంచబ్యాంకు తాజాగా నిర్ణయం తీసుకుంది.


‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తి సహకారం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ సిద్ధంగా ఉంది. ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, విపత్తు నివారణ రంగాల్లో సహకరం అందించేందుకు బిలియన్ డాలర్ల కార్యాచరణ ఉంది. ఆరోగ్య రంగం కోసం 328 మిలియన్ డాలర్లు సహకారం అందించనున్నాం. జూన్ 27న దీనికి సంబంధించిన ఒప్పందం జరిగింది’ అని వరల్డ్ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది.

ప్రపంచబ్యాంకు రుణం వెనక్కి పోవడంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం సంప‌్రదింపులు జరిపింది. దీంతో రాజధానికి బదులుగా మరో మౌలిక సౌకర్యాల ప్రాజెక్టు రుణం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రపంచబ్యాంకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం పంపింది. దీంతో ప్రపంచబ్యాంకు రుణం కోసం ప్రతిపాదించాల్సిన ప్రాధాన్యతా ప్రాజెక్టు కోసం జగన్ సర్కారు.. అన్వేషణ ప్రారంభించింది. త్వరలో రాష్ట్రంలో ఓ కీలక మైన ప్రాజెక్టును ఎంపిక చేసి ప్రపంచబ్యాంకు రుణం కోసం కొత్తగా మరోసారి జగన్ ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై సమగ్ర పరిశీలన జరిపిన తర్వాత ప్రపంచబ్యాంకు 300 మిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ రుణం మంజూరు చేసే అవకాశముంది.(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: July 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>