Atchannaidu: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభాపక్ష ఉప నేత కె.అచ్చెన్నాయుడు పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈనెల 27న పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అచ్చెన్నాయుడి పేరును ప్రకటించడమే మిగిలి ఉందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో సడన్‌గా తెరపైకి ఓ కొత్త నేత పేరు వచ్చింది. అచ్చెన్నాయుడితో పాటు ఈ కొత్త నేత పేరును కూడా పరిశీలించాలంటూ కొందరు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. ఆయన ఎవరో కాదు. నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్. అచ్చెన్నాయుడితో పాటు రవిచంద్ర యాదవ్ పేరును కూడా పరిశీలించాలని కొందరు సీనియర్ నేతలు చంద్రబాబు చెవిన వేసినట్టు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన నేత. యువకుడు, బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో అతడి చేతికి పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని కొందరు నేతలు చెబుతున్నారు. అయితే, దీనిపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు.

బీద రవిచంద్ర యాదవ్
ఈనెల 27న ఏపీ టీడీపీ అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను, 25 మంది అధ్యక్షులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అటు ఏపీ ప్రభుత్వం కూడా ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ కూడా ముందస్తుగానే ఒక్కో పార్లమెంట్‌ను జిల్లాగా చేసుకుని దానికి జిల్లాల అధ్యక్షులను ప్రకటించడానికి సన్నాహాలు చేస్తోంది.

చంద్రబాబునాయుడు
అచ్చెన్నాయుడు దూకుడుగా ఉండే నేత. టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత. అసెంబ్లీలో వైఎస్ జగన్ ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ ఉంటారు. అలాంటి నేతను ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమిస్తే బీసీల్లో కోల్పోయిన పట్టును మళ్లీ సాధించవచ్చని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. కళా వెంకట్రావు కూడా వీలైనంత త్వరగా పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నారు. అచ్చెన్నాయుడు 2009 ఎన్నికల్లో టెక్కలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో టెక్కలి నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు.

రామ్మోహన్ నాయుడు
ప్రస్తుతం ఉత్తారంధ్రకు చెందిన సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఆయనే పార్టీ బాధ్యతల్ని చూస్తున్నారు.. అలాగే మంత్రి పదవి కూడా చేపట్టారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత వెంకట్రావును తప్పిస్తారనే ప్రచారం జరిగింది. ఎప్పటికప్పుడు కొత్త అధ్యక్షుడి నియామకంపై ప్రచారం జరిగినా చంద్రబాబు మాత్రం అధికార ప్రకటన చేయలేదు. ఇక తెలుగు యువత పదవికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు యువత అధ్యక్ష పదవి చేపట్టడానికి రామ్మోహన్నాయుడు అంత సుముఖంగా లేరని సమాచారం. తనకు శ్రీకాకుళం లోక్‌సభ ఎంపీ బాధ్యతలు ఉండటంతో ఈ పదవికి న్యాయం చేయలేనని.. మరెవరినైనా పరిశీలించాలని ఆయన చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.
బీద రవిచంద్ర యాదవ్ నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, టీడీపీ MLCగా ఉన్నారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటారు. అచ్చెన్నాయుడి పేరు దాదాపు ఖరారైన సమయంలో రవిచంద్ర పేరు తెరపైకి రావడం టీడీపీలో ఆసక్తికరంగా మారింది.