ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై చర్చను ఆసక్తికరంగా మార్చుతూ ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరుస నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఆప్.. మంగళవారం నాడు పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవత్ మాన్ పేరును డిక్లెర్ చేయగా, బుధవారం నాడు గోవా రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసింది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రముఖ అడ్వొకేట్ అమిత్ పాలేకర్ పేరును కేజ్రీవాల్ ప్రకటించారు. పనాజీ వేదికగా జరిగిన ప్రెస్ మీట్ లో గోవా రాజకీయాలు, అమిత్ పాలేకర్ ఎంపిక ఎందుకనే అంశాలపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు..
గోవాలో ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త అమిత్ పాలేకర్ పేరును ఆప్ సీఎం అభ్యర్థిగా ఖరారు చేశారు ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. అమిత్ పాలేకర్ భండారీ (ఓబీసీ) సమాజికవర్గానికి చెందిన విద్యావంతుడని కేజ్రీవాల్ నొక్కి చెప్పారు. గోవా జనాభాలో 35 శాతంగా ఉన్నప్పటికీ భండారీ కులం ఇప్పటిదాకా వంచనకు గురవుతూనే ఉందని, చరిత్ర మొత్తంలో భండారీ కులం నుంచి రవి నాయక్ కేవలం రెండున్నరేళ్లు సీఎంగా పనిచేశారని, గోవా దశ-దిశను పూర్తిగా మార్చేయడానికే ఆ వర్గానికి చెందిన అమిత్ పాలేకర్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తున్నామన్నారు. వాస్తవానికి ఆప్ కుల రాజకీయాలకు దూరంగా ఉంటుందని, మిగతా రాజకీయ పార్టీలే కులాల్ని రాజకీయంగా వాడుకుంటున్నాయని కేజ్రీవాల్ అన్నారు.
ఢిల్లీ తరహాలో మంచి స్కూళ్లు, ఆస్పత్రులు కావాలని గోవన్లు కోరుతున్నారని, ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించగల, సామాజిక అంశాలపై చక్కటి అవగాహన కలిగిన అమిత్ పాలేకర్ ను సీఎం అభ్యర్థిగా ప్రజలు తప్పక ఆదరిస్తారని, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తుందని, గోవాలో అవినీతిని పాలేకర్ రూపుమాపుతారని కేజ్రీవాల్ అన్నారు. గతేడాది అక్టోబర్ లోనే ఆప్ లో చేరిన అమిత్ పాలేకర్ ఇప్పుడు సీఎం అభ్యర్థిగా ఖరారు కావడం గమనార్హం. ఆప్ సీఎం అభ్యర్థిగా పాలేకర్ తొలి ప్రసంగంలోనే బీజేపీ, కాంగ్రెస్ లపై విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీల మధ్య ఫిరాయింపులను ఎద్దేవా చేశారు.
‘గోవాలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అభ్యర్థులు ఒక పార్టీతో లంచ్, మరో పార్టీతో టీ, ఇంకో పార్టీతో డిన్నర్ అన్నట్టుగా ఉంది. మనం కోరుకునే రాజకీయం ఇదేనా? గోవాలో మార్పు రావాలి. మంచి స్కూళ్లు, ఆస్పత్రులు ఉండాలి. రాజకీయ నాయకులు ధనవంతులవుతోంటే, ప్రజలు అంతకంతకూ పేదలుగా మారుతున్నారు. ఇది మారాలి. ఢిల్లీలో ఆప్ చేసి చూపించింది, గోవాలో కూడా పునరావృతం అవుతుంది. మాకు ఒక్క అవకాశం కావాలంతే’అని అమిత్ పాలేకర్ వ్యాఖ్యానించారు. మొత్తం 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.