29 ఏళ్లకే సీఎం పదవి.. మరాఠా పీఠంపై శివసేన వారసుడు..?

ప్రస్తుతం ఆయన భారీ మెజార్టీతో గెలవడం, బీజేపీతో 50-50 ఫార్ములాను శివసేన బలంగా వినిపిస్తుండడంతో.. ఆదిత్య థాక్రేకు రెండున్నరేళ్లు మహారాష్ట్ర సీఎం పదవి దక్కే అవకాశముంది. ఐతే ముందు శివసేనే సీఎం పదవి చేపడితే.. 29 ఏళ్లకే సీఎం పగ్గాలు చేపట్టిన నేతగా ఆదిత్య థాక్రే చరిత్ర సృష్టించడం ఖాయం.

news18-telugu
Updated: October 24, 2019, 10:08 PM IST
29 ఏళ్లకే సీఎం పదవి.. మరాఠా పీఠంపై శివసేన వారసుడు..?
ఆదిత్య థాక్రే
  • Share this:
మరాఠా ప్రజలు మళ్లీ బీజేపీ-శివసేన కూటమికే జైకొట్టారు. 288 అసెంబ్లీ సీట్లు మహారాష్ట్రలో బీజేపీ కూటమి 163 సీట్లలో గెలిచింది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 103 స్థానాలకే పరిమితమైంది. ఇతరులకు 22 స్థానాలు దక్కాయి. బీజేపీ కూటమిలో బీజేపీకి 105 సీట్లు రాగా..శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది. ఐతే బీజేపీకి గతంలో పోల్చితే కొన్ని సీట్లు తగ్గితే.. శివసేన తన గ్రాఫ్‌ను పెంచుకుంది. ఈ క్రమంలో సీఎం పీఠంపై కన్నేసింది శివసేన. సీట్ల పంపకానికి ముందే 50-50 ఫార్ములాతో ఒప్పందం చేసుకున్నామని.. దాన్ని అమలు చేయాలని పట్టబట్టుతోంది. దీని ప్రకారం చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలన్న ప్రతిపాదనను తీసుకొస్తోంది.

ఎన్నికలకు ముందే దీనిపై ఇరుపార్టీల మధ్య ఒప్పందం జరిగిందన్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే.. దాని ప్రకారమే పదవులను పంచుకుంటామని ఎన్నికల ఫలితాల అనంతరం తెలిపారు. ఐతే మొదట సీఎం పదవిని ఎవరు చేపట్టాలన్నది మాత్రమే నిర్ణయించాల్సి ఉందని చెప్పారు. శివసేన డిమాండ్‌కు బీజేపీ అంగీకరిస్తే.. రెండు పార్టీలు చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిలో ఉంటాయి. బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి సీఎం పగ్గాలు చేపట్టే అవకాశముంది. మరి శివసేన నుంచి ఎవరు సీఎం అవుతారన్న దానిపై ఇప్పుడు మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శివసేనకు సీఎం పదవి ఛాన్స్ వస్తే.. ఖచ్చితంగా ఆదిత్య థాక్రేనే ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

1966లో బాల్ థాక్రే శివసేన పార్టీని స్థాపించారు. ఐతే అప్పటి నుంచి థాక్రే కుటుంబానికి చెందిన ఏ ఒక్కరూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ తొలిసారిగా శివసేన వారసుడు ఈ సారి ఎన్నికల బరిలో దిగాడు. ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే.. వర్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎన్సీపీ అభ్యర్థి సురేష్ మానేపై 70వేల మెజార్టీతో గెలిచారు ఆదిత్య. శివసేన కార్యక్రమాల్లో ఆదిత్య ముందు నుంచీ చురుగ్గా ఉంటూ.. రోడ్ షోలు, బహిరంగ సభల్లో తనమైన మార్క్ చూపించారు. ప్రస్తుతం ఆయన భారీ మెజార్టీతో గెలవడం, బీజేపీతో 50-50 ఫార్ములాను శివసేన బలంగా వినిపిస్తుండడంతో.. ఆదిత్య థాక్రేకు రెండున్నరేళ్లు మహారాష్ట్ర సీఎం పదవి దక్కే అవకాశముంది. ఐతే ముందు శివసేనే సీఎం పదవి చేపడితే.. 29 ఏళ్లకే సీఎం పగ్గాలు చేపట్టిన నేతగా ఆదిత్య థాక్రే చరిత్ర సృష్టించడం ఖాయం.

First published: October 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>