కేసీఆర్‌ను టార్గెట్ చేసేందుకు బీజేపీకి మరో అస్త్రం, జగన్‌కి ఎలా సాధ్యమైంది?

ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు

తెలంగాణ బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీద మండిపడ్డారు. ఆదివాసీలకు పోడు వ్యవసాయం చేసుకునేందుకు పట్టాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.

 • Share this:
  తెలంగాణ బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీద మండిపడ్డారు. ఆదివాసీలకు పోడు వ్యవసాయం చేసుకునేందుకు పట్టాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్‌తో కలసి సోయం బాపూరావు మీడియాతో మాట్లాడారు. ‘ఆదివాసీలు పోడు వ్యవసాయం చేసుకునే భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి కేసీఆర్ మోసగించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అది కేంద్రం పరిధిలోకి వస్తుందని, రాష్ట్ర పరిధిలో లేవని కేసీఆర్ వితండవాదం చేస్తున్నారు. మరి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా పట్టాలు ఇచ్చారో గ్రహించాలి. ట్రైబల్ యూనివర్సిటీని వరంగల్ జిల్లా ములుగుకు తరలించి, ఆదిలాబాద్ ఆదివాసీలకు అన్యాయం చేసారు.’ అని సోయం బాపూరావు అన్నారు.

  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి తర్వాత బీజేపీ పుంజుకుంటోందని ఆదిలాబాద్ ఎంపీ అన్నారు. ఇది సహించలేకపోయిన సీఎం కేసీఆర్ అయోమయం సృష్టించడం కోసం ఢిల్లీ పర్యటన చేపట్టారన్నారు. ఒకవేళ అధికారికంగా సీఎం హోదాలో కలిస్తే అధికారులను వెంటబెట్టుకుని వెళ్ళాలని, కానీ అలా జరగలేదంటే, ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన అవినీతి బయటపడుతుందన్న భయంతోనే ఈ రకంగా వ్యవహరిస్తున్నారని బాపూరావు ఆరోపించారు. ఇదే విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేవనెత్తితే, వాటికి సమాధానం చెప్పకుండా, ఆయన మీద వేరే వాళ్ళతో ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనే నినాదం కేసీఆర్ సొంత కుటుంబానికే దక్కాయి తప్ప మరొకరికి రాలేదన్నారు. రిటైర్ అయిన ఉద్యోగుల కారణంగా ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలని, మొత్తం 1.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని బాపూరావు డిమాండ్ చేశారు.

  కేసీఆర్ డిల్లీ టూర్‌పై బండి సంజయ్ హాట్ కామెంట్స్

  తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కోతల రాయుడని, కోతలు కోస్తారని ఎద్దేవా చేశారు. లోపల జరిగేది ఒకటి. బయట చెప్పేది ఒకటన్నారు. కేంద్రం పెద్దలతో కేసీఆర లోపల ఏం మాట్లాడారో రాతపూర్వకంగా ఇస్తేనే ప్రజలు ఆయన్ను నమ్ముతారన్నారు. కేంద్రాన్ని బద్ నాం చేసే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఒక్కరే వెళ్లి కలిశారన్నారు. కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా పక్కన, ఎవరో ఒకర్ని తీసుకుని వెళతారని, కానీ, ఈ సారి ఒక్కరే వెళ్లారని, ఆ రహస్యం ఏంటో చెప్పాలన్నారు. ‘కేసీఆర్ వంగి వంగి పొర్లు దండాలు పెట్టినా క్షమించం. ప్రజల దృష్టి మరల్చడానికే కేసీఆర్ ఢిల్లీ పర్యటన. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు చావు దెబ్బ కొట్టారు. లోపల జరిగేది ఒకటి.. కేసీఆర్ బయట చెప్పేది ఇంకొక్కటి. వరదల సమయంలో కేసీఆర్ ఫాంహౌస్ వదిలి బయటకు రాలేదు. కాళేశ్వరం మూడో టీఎంసీ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం.కాళేశ్వరానికి తక్కువ సమయంలో కేంద్రం అనుమతులిచ్చిందని కేసీఆరే చెప్పారు. కాళేశ్వరం అంచనాలను అడ్డగోలుగా పెంచారు. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం' అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: