ACTRESS AND NAGARI YSRCP MLA RK ROJA COMMENTS ON BADVEL BY ELECTION RESULT MKS GNT
badvel bypoll: వార్ వన్ సైడ్.. మెజార్టీపైనే గురి : వైసీపీ ఎమ్మెల్యే RK Roja -నగరిలో మాత్రం షాక్
వైసీపీ ఎమ్మెల్యే రోజా(ఫైల్)
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలో వైసీపీ విజయం ఖరారైపోయిందని, మెజార్టీ కోసమే ప్రచారం నిర్వహింస్తున్నామని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. కాగా, సొంత నియోజకవర్గమైన నగరిలో మాత్రం రోజా వర్గం చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది..
ఆకాశానికి సూర్యుడిలా, అరణ్యానికి సింహంలా, ఆంధ్రదేశానికి రారాజు వైఎస్ జగన్ అని, దేశ చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చిపోయినా, ఏపీకి 17 మంది సీఎంలుగా పనిచేసినా వాళ్లందరిలోకీ ప్రత్యేక చరిత్ర జగన్‌ది అని నగరి వైసీసీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కొనియాడారు. మంగళవారం కడప జిల్లాలో పర్యటించిన ఆమె బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. గోపవరం మండలం రాచాయపేటలో వైసీపీ నిర్వహించిన భారీ సభలో మాట్లాడుతూ రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
ఏపీలో జగన్ సీఎం అయిన తర్వాత ఎక్కడ ఎలాంటి ఎన్నికలు జరిగినా గెలిచేది, గెలవబోయేదీ వైసీపీనే అని, జగనన్నను ప్రజలు గుండెల్లో పెట్టుకోవడం వల్లే ఇది సాధ్యమయిందని రోజా అన్నారు. బద్వేల్ ఉప ఎన్నికలోనూ వార్ వన్ సైడే అని, వైసీపీకి భారీ మెజార్టీ కోసమే ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్ని పార్టీలు గుంపులుగుంపులుగా వచ్చినా.. జగన్ సింగిల్ గానే బరిలోకి దిగుతారని, రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు బద్వేల్ ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని వ్యాఖ్యానించారు.
బద్వేల్ ఉప ఎన్నికలో ప్రచారానికి బుధవారం(అక్టోబర్ 27)చివరి రోజు కావడంతో అన్ని పార్టీలూ కీలక నేతలను రంగంలోకి దించాయి. వైసీపీ తరఫున మంత్రి సురేశ్, ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి తదితరులతో కలిసి రోజా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నెల 30న పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 2న ఫలితాలు వెలువడుతాయి. ఇదిలా ఉంటే, బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారంలో బిజీగా ఉన్న ఎమ్మెల్యే రోజా.. తన సొంత నియోజకవర్గమైన నగరిలో మాత్రం వర్గపోరు ఎదుర్కొంటున్నారు.
నగరి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే రోజా, శ్రీశైలం ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా ఉన్న చక్రపాణిరెడ్డి వర్గాల మధ్య చాలా కాలంగా విభేదాలు నడుస్తున్నాయి. నిండ్ర మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక సందర్భంలోనూ రోజా అభీష్టానికి వ్యతిరేకంగా చక్రపాణి వర్గం వ్యవహరించింది. ఇరు వర్గాలు వాదులాటకు దిగడంతో నిండ్ర ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఈ వ్యవహారంపై రోజా, చక్రపాణి వర్గాలకు చెందిన నేతలు పరస్పరం మంత్రి పెద్దిరెడ్డికి ఫిర్యాదు చేశారని తెలిసింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.