కేటీఆర్ వల్లే ప్రత్యక్ష రాజకీయాల్లోకి: ప్రకాశ్ రాజ్

prakash raj with ktr

విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. తాను ప్రత్యక్షరాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించిన ఆయన.. తన నిర్ణయానికి కారకులెవరనే విషయాన్నీ వెల్లడించారు.

 • Share this:
  ఇన్నాళ్లూ సిల్వర్ స్క్రీన్‌పై తన నటనతో ఆకట్టుకున్న ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్.. రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఇన్నాళ్లూ బయట నుంచే రాజకీయ విమర్శలు చేసిన ఆయన.. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై యాక్టివ్‌గా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు ప్రకాశ్ రాజ్. తాజాగా, తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

  అయితే, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న తన నిర్ణయానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావే స్పూర్తి అన్నారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని స్పష్టం చేసినప్రకాశ్ రాజ్.. తనకు సపోర్టుగా నిలిచినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్‌తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. కొన్నాళ్లుగా దేశంలో జరుగుతున్న రాజకీయ, సామాజిక అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్న ప్రకాశ్ రాజ్.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సన్నిహితంగా ఉంటున్నారు.

  కేసీఆర్‌తో ప్రకాశ్ రాజ్ (ఫైల్)
  కేసీఆర్‌తో ప్రకాశ్ రాజ్ (ఫైల్)


  కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌కు కూడా ప్రకాశ్ రాజ్ మద్దతు తెలిపారు. ఫ్రంట్‌కు సంబంధించి పలు రాష్ట్రాల నేతలతో కేసీఆర్ జరిపిన చర్చల్లోనూ ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి ప్రకటన చేయడం, అందుకు కేటీఆరే తనకు స్ఫూర్తిగా పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఆయన టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే ప్రకాశ్‌రాజ్ మాత్రం తాను స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగనున్నట్టు స్పష్టం చేశారు.

  ప్రకాశ్‌రాజ్ రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇవ్వడంతో.. ఇప్పుడాయన ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్న ప్రకాశ్ రాజ్.. మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన స్వతంత్రుడిగా బరిలో నిలిచినా.. మహబూబ్‌నగర్ స్థానం నుంచే పోటీచేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, ఆయన ఇతర రాష్ట్రాల నుంచి పోటీచేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

  First published: